ధర్మపురి దేవస్థానంలో వైభవంగా తులసీ కృష్ణుల కళ్యాణం
ధర్మపురి దేవస్థానంలో వైభవంగా తులసీ కృష్ణుల కళ్యాణం
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి నవంబర్ 14:
ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో గురువారం రాత్రి తులసీ కృష్ణుల కళ్యాణ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. కృష్ణునితో తులసికి అయ్యే దివ్య వివాహ పర్వం ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రధానంగా క్షీరాబ్ది శయనుడైన విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశినాడు లక్ష్మి, బ్రహ్మ మొదలగు వారితో కూడి తులసి బృందావనికి వస్తాడని, ఆ రాక క్రమంలో, పంచపర్వాలలో భాగంగా రాత్రి విష్ణువును పూజించి, దానాలు ముఖ్యంగా దీప దానం చేసి, తులసి కళ్యాణం చేయాలని పురాణాలు చెపుతున్నాయి. కార్తీక శుద్ధ ఏకాదశి మొదలు ఐదు రోజులలో కుల, దేశాచారాలను బట్టి తులసి వివాహం చేయాలని సూచించ బడింది. ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో గురువారం రాత్రి సాంప్రదాయాచరణలో భాగంగా తులసీ కళ్యాణ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. కార్తీక మాసంలో దేవస్థానం పక్షాన పక్షం రోజులు నిర్వహించే గోదావరీ పూజ, కార్తీక దీపాలను వదిలిపట్టే కార్యక్రమం ముగిసాక, వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో గోదావరినుండి తిరిగివచ్చిన అనంతరం, దేవస్థాన అంతర్గత శ్రీవేణుగోపాల ఆలయ సమీపస్థ శేషప్ప కళా వేదిక పై ముఖ్య అర్చకులు శ్రీనివాసా చార్య, సంపత్, సంతోష్ తదితరులు
విదివిధాన వేదోక్త సనాతన సాంప్రదాయ పద్దతిలో కళ్యాణాన్ని నిర్వహించారు. పంచపర్వాలలో భాగంగా, వైకుంఠ చతుర్దశి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని, గోధూళి సముహూర్తంతో ప్రారంభించి, రాత్రివరకూ నిర్వహించిన తులసీ కల్యాణోత్స వంలో అధిక సంఖ్యలో భక్తులు భాగస్వాములైనారు. సత్యభామ, రుక్మిణీ సహిత కృష్ణ మూర్తి కల్యాణ మూర్తులను సుఖాసీనుల చేసి, మధ్య అంతరపటంగా శాలువా పట్టి, పసుపు, గుడ్డలు, గాజులు తదితర ఆభరణాలు కట్టి, మంగళాష్టకాలు చదివి, వివాహ తంతు జరిపించారు.
శ్రీవేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజలు
ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థానంలోని శ్రీవేణు గోపాల స్వామి ఆలయంలో గురు వారం ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. కార్తీక శుద్ధ ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు పంచ పర్వాలలోని ఐదు రోజులలో తులసికి కృష్ణునితో వివాహం జరపడం సనాతర ఆచారం కాగా, ధర్మపురి క్షేత్రస్థ శ్రీవేణు గోపాలాలయంలో కార్తీక శుద్ధ చతుర్దశి (వైకుంఠ చతుర్దశి) సాయంత్రం కల్యాణం నిర్వ హించడం సాంప్రదాయంగా ఉంది. కృష్ణునితో తులసికి అయ్యే వివాహం వివాహ రుతువును స్వాగతిస్తుంది. వివాహాలకు మాఘాది పంచకాలు తగినవి. తులసి వివాహ పర్వం కార్తీకంలో వస్తుంది. అంటే వివాహ రుతువుకు తులసి కృష్ణుల కళ్యాణం పురోగామి అన్నమాట. చతుర్దశి తిథి తులసీ కృష్ణుల వివాహం జరుగనున్న క్రమంలో ఆలయంలో ఈ సందర్భంగా అర్చకులు మధుసూధనాచార్య ప్రత్యేక పర్వదిన పూజలను నిర్వహించారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది, అర్చకులు, పండితులు భక్తులు పాల్గొన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వైభవంగా వైకుంఠ చతుర్దశి వేడుకలు
కార్తీక మాస పర్వదిన సందర్భంగా గురు వారం ధర్మపురి క్షేత్రం భక్తులతో కిటకిట లాడింది. పంచపర్వాల చతుర్ద దినాన విష్ణువు శంకరుని పూజించ డానికి వైకుంఠాన్ని వీడి వెళ్ళడం జరిగిందన్న పురాణ కథనం ఆధారంగా, వైకుంఠ చతుర్దశిగా పిలువబడే కార్తీక శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని అశేష భక్తులు గోదావరి నదిలో మంగ ళస్నానాలు ఆచరించారు. అశేష భక్తులు గోదావరి మాతను అర్చించారు. నదీ పురోహితులచే సంకల్పాలు, దానధర్మాలు ఆచరించారు. అనంతరం దేవ స్థానానికి చేరుకుని, వివిధ ఆలయాలలో దైవదర్శనాలు చేసుకున్నారు. ప్రత్యేకించి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన అంతర్గత ఉసిరిక వృక్షం చుట్టూ సనాతన సంప్రదాయ ఆచర ణలో భాగంగా మహిళలు ప్రదక్షిణలు ఆచరించి, కార్తీక దామోదరునికి ప్రత్యేక పూజలొనరించారు. వత్తులను వెలిగించారు. దీప దానాలను చేసుకున్నారు. సాయంత్రం దేవస్థానం నుండి మంగళవాద్యాలతో గోదావరికి వెళ్ళి, హారతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు.