దొడ్డు వడ్లు పండించేవారు రైతులు కాదా? - వారికీ రూ.500 బోనస్ ఇవ్వాలి
టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్
ఎల్కతుర్తి (ప్రజామంటలు)
రాష్ట్రంలో దొడ్డు వడ్లు పండించే వారు రైతులు కాదా? అని తెలంగాణ రైతు రక్షణ సమితి (టీ ఆర్ ఎస్) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ ప్రశ్నించారు. మంగళవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. సన్నాలతో పాటు దొడ్డు రకం వడ్లు పండించే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట కోతలు జరిగి రెండు నెలలు దాటుతున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పంట కొనుగోళ్ళు పూర్తిస్థాయిలో జరగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయి ఇప్పటికే నష్టపోయిన రైతులు.. ధాన్యం కొనుగోలు జరుపకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రాష్ట్ర సర్కారు రైతులకు అండగా నిలవాలని కోరారు. వానాకాలంతో పాటు యాసంగి సీజన్ కు సంబంధించిన పెట్టుబడి సాయం కింద 'రైతు భరోసా' అందజేసి.. ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. తమది రైతు సంక్షేమ సర్కార్ అని మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లోనూ చేసి చూపించాలని సూచించారు.