శ్వేతపత్రం విడుదల చేశాకే పాదయాత్ర చేపట్టాలి
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ డిమాండ్
శ్వేతపత్రం విడుదల చేశాకే పాదయాత్ర చేపట్టాలి
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ డిమాండ్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి నవంబర్ 11:
రైతులపై కపట ప్రేమ ఒలక బోస్తూ, పాదయాత్రకు చేస్తామని ప్రకటించిన బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిదులు, నేతలు... తాము అధికారంలో ఉన్న దశాబ్ద కాలంలో రైతులకు ఏమి మేలు ఒనగూర్చారో శ్వేత పత్రం విడుదల చేశాకే పాదయాత్ర చేపట్టాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు
లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో లక్ష్మణ్ కుమార్
మాట్లాడుతూ...2014నుండి 2023వరకూ అధికారం చెలాయించిన టి ఆర్ ఎస్,
బి ఆర్ ఎస్ ప్రభుత్వాల హయాంలో రైతులకు ఏమి చేశారో చెప్పిన తర్వాతే పాదయాత్రలు చేపట్టాలని సూచించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కరు పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్ట పోయిన రైతులకు నష్టరిహారం చెల్లించిన దాఖలాలు లేవని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కోతలు విధించి, దోచుకుంటే ఒక్క ప్రజా ప్రతినిధి నోరు ఎందుకు మెదప లేదని ప్రశ్నించారు. రైతులకు బీడీలు వేసిన ఘనత గత ప్రభుత్వానిదే అన్నారు.
పార్టీ ఉనికి కోసం ఏదో చేయాలని చూస్తున్నారని, తమ ప్రభుత్వం ఏడు నెలల కాలంలో చేసిన పనులు చూడలేక పోతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టి 11నెలలు అయినా, 4నెలలు ఎన్నికల కోడ్ ఉన్నదని, మిగిలిన 7మాసాల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసే ప్రయత్నాలు జరిగాయన్నారు. మహిళకు ఉచిత బస్, 200యూనిట్లు లోపు విద్యుత్ చార్జీలు మాఫీ, 39వేల ఉద్యోగాలు, గ్యాస్ సిలిండర్ ప్రధానంగా రైతులకు రుణమాఫీ చేశామన్నారు. జగిత్యాల జిల్లాలో 65వేల రైతులకు రుణ మాఫీ చేశామని, మిగిలిన వారికి బాధ్యత తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధికి 500కోట్లు కేటాయిస్తామని ఎన్నికల వాగ్దానం చేసిన కేసీఆర్ తర్వాత మరిచారన్నారు. ప్రజలు ప్రతిపక్ష నేతల చేష్టలను గమనిస్తున్నారన్నారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్, నాయకులు జక్కు రవి, వేముల రాజేశ్, చిలుముల లక్ష్మణ్, చీపిరిశెట్టి రాజేశ్, మొగిలి, సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.