ఠాణాలో లొంగిపోయిన దంపతులు రూ11 కోట్ల చిట్టీ డబ్బులతో 20 రోజుల క్రితం పరారీ
ఠాణాలో లొంగిపోయిన దంపతులు
రూ11 కోట్ల చిట్టీ డబ్బులతో 20 రోజుల క్రితం పరారీ
* న్యాయం చేయమంటున్న 144 మంది బాధితులు
* వారాసిగూడ పీఎస్ ఎదుట ఆందోళన
సికింద్రాబాద్ నవంబర్ 05 (ప్రజా మంటలు):
చిట్టీల పేర రూ 11 కోట్లు వసూలు చేసి పరారైన దంపతుల జంట వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...వారాసిగూడ పీఎస్ పరిధిలోని బాపూజీనగర్ కు చెందిన చిన్నాల అమరేందర్ యాదవ్ (53), సబిత (49) దంపతులు గత 20 ఏండ్లుగా నమ్మకంగా ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అమరేందర్ యాదవ్ కాచిగూడ లోని వైశ్య హాస్టల్లో వార్డెన్ గా పనిచేస్తున్నాడు. చాలా కాలంగా నమ్మకంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న అమరేందర్ యాదవ్ స్థానికుల వద్ద విశ్వాసం పొంది 144 మంది నుంచి దాదాపు రూ.11 కోట్లకు పైగా డబ్బులను చిట్టీల పేర వసూలు చేశారు. చిట్టీ పాట పాడిన వారికి చిట్టీ డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్న అమరేందర్ యాదవ్ దసరా పండుగ తర్వాత ఉన్నట్టుండి గత నెల 14 నుంచి దంపతులు ఇద్దరు కనిపించకుండా పోయారు. దాంతో తాము నష్టపోయామని భావించిన బాధితులు లబోదిబో మంటూ ఇటీవల సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ( సీసీఎస్) ను ఆశ్రయించి, కంప్లెయింట్ చేశారు. ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) పేర అమరేందర్ యాదవ్ ఇటీవల తమకు అడ్వకేట్ ద్వారా నోటీసులు పంపించినట్లు బాధితులు తెలిపారు. ఈ నేపద్యంలో నిందితులు అమరేందర్, సబిత దంపతులు ఇద్దరు మంగళవారం వారాసిగూడ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. వీరు ఠాణాకు వచ్చారన్న సమాచారం అందుకున్న బాధితులు స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. కష్టపడి రూపాయి, రూపాయి కూడబెట్టుకొని చిట్టీలు వేసి, లక్షలాది రూపాయలు డబ్బులు ఇచ్చామని వాపోయారు. తమ ఆడపిల్లల పెండ్లికోసం, తమ చిన్నారుల ఉన్నత చదువుల కోసం, ఇంటి నిర్మాణం కోసం ఇలా...పలు రకాల అవసరాల కోసం డబ్బులను డిపాజిట్ గా అమరేందర్ యాదవ్ కు ఇచ్చామని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు రూ 22 లక్షల చిట్టీ డబ్బులు రావాల్సి ఉందని శ్యామ్ అనే బాధితుడు వాపోయాడు. తాను లక్ష రూపాయలు చెల్లించానని ఉమేశ్ పేర్కొన్నాడు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని, ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే తమకు చావే గతి అంటూ పలువురు మహిళలు కన్నీంటి పర్యంతమయ్యారు. నిందితుడు అమరేందర్ కు కోట్లాది రూపాయల విలువ చేసే స్థిర, చరాస్తులు ఉన్నాయని, కోర్టు జోక్యం చేసుకొని, వాటిని విక్రయించి, తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని బాధితులు వేడుకున్నారు. కోట్ల రూపాయల మోసం కు సంబందించిన వ్యవహారం కావడంతో ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
–––––––––––
–ఫొటో:: వారాసిగూడ ఠాణా ఎదుట బాధితుల ఆందోళన