"ప్రజావాణి " చొరవతో ఆర్టీసీ త్రిసభ్య కమిటీ ఏర్పాటు ప్రజా భవన్ లో బాధిత ఆర్టీసీ కార్మికుల విజయోత్సవాలు
"ప్రజావాణి " చొరవతో ఆర్టీసీ త్రిసభ్య కమిటీ ఏర్పాటు
ప్రజా భవన్ లో బాధిత ఆర్టీసీ కార్మికుల విజయోత్సవాలు
హైదరాబాద్ డిసెంబర్ 24:
ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమం చొరవ వల్ల ఆర్టీసీలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు కావడం పట్ల బాధిత ఆర్టీసీ కార్మికులు మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో విజయోత్సవాలు నిర్వహించారు.
మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్లో దాదాపు 500 మంది బాధిత ఆర్టీసీ కార్మికులు తరలివచ్చి సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజావాణి ఇంచార్జీ డాక్టర్ జీ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్యలకు బాధిత ఆర్టీసీ కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.
మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్నారని, బస్ స్టాప్ లో బస్సు ఆపలేదని, విధులు సరిగా నిర్వహించలేదని వంటి చిన్న చిన్న కారణాలను సాకుగా చూపి తమను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని బాధిత ఆర్టీసీ కార్మికులు సీఎం ప్రజావాణిలో రెండు నెలల కిందట గోడును వెళ్ళబుచ్చుకున్నారు.
వారి సమస్యలను ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుని వెళ్లారు.
ఉద్యోగాల నుంచి తొలగించబడిన ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఇటీవల ఏర్పాటు చేసింది.
తమ ఉద్యోగాలను సత్వరమే ఇప్పించాలని , ఈ మేరకు త్రిసభ్య కమిటీ కృషి చేయాలని బాధిత ఆర్టీసీ కార్మికుల ప్రతినిధులు దుగ్గు రాజేందర్, సుంకరి బాగేశ్వర్, కుమ్మరి గంగాధర్, చెరుకు భూమేష్, చెక్క సంపత్, వై. ప్రకాష్, ఎలమర్తి ప్రసాద్ రావు విజ్ఞప్తి చేశారు.
ప్రజావాణిలో 370 దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం జరిగిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 370 దరఖాస్తులు అందాయి.
ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 107 దరఖాస్తులు, విద్యుత్ శాఖకు 80, రెవెన్యూ శాఖకు 65, ప్రవాసి ప్రజావాణికి 4, ఇతర శాఖలకు 114 దరఖాస్తులు అందాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు అందాయి.