సీఎం వేములాడ స్వామి దర్శనం -ప్లేటు భోజనం 32 వేలు? దేవునికి కోటి 70 లక్షల బిల్లు?
ఆలయ నిబంధనలూ మంట గలిపారు!10 వేలతో పట్టు పంచెలు? తెరపైకి పంచాయితీ?
సీఎం వేములాడ స్వామి దర్శనం -ప్లేటు భోజనం 32 వేలు?
దేవునికి కోటి 70 లక్షల బిల్లు?
ఆలయ నిబంధనలూ మంట గలిపారు!10 వేలతో పట్టు పంచెలు? తెరపైకి పంచాయితీ?
వేములవాడ డిసెంబర్ 19:
సీఎం వేములాడ స్వామి దర్శనం చేసుకొని, అక్కడ భోజనం చేసినందుకు -ప్లేటు భోజనం 32 వేలు, మొత్తం దర్శనం టూర్ ఖర్చు అంతా కలిసి దేవుని ఖాతాలో కోటి 70 లక్షల బిల్లు చెల్లించాల్సిందిగా దేవస్థానానికి చేరిన బిల్లులు.
ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది.
సీఎం రేవంత్‌రెడ్డి సహా వందమందికి ఖర్చు రూ.32 లక్షలు
వేములవాడ రాజన్న గుడికి బిల్లులు పంపిన తాజ్‌కృష్ణ
ఆలయ చైర్మన్ చాంబర్‌నే హోటల్‌గా మార్చేసిన సిబ్బంది
ఒక్కో పట్టు పంచెకు పదివేలు ఖర్చు పెట్టిన అధికారులు
తాగే గ్లాస్ నుంచి టేబుల్ వరకు విందుకోసం కొనుగోలు
రాజన్న దర్శనంతో కలిపి మొత్తం ఖర్చు కోటీ 70 లక్షలు!
బిల్లు మొత్తం ఆలయమే చెల్లించాలని ఉన్నతాధికారి ఒత్తిడి
సిరిసిల్ల కలెక్టర్ వద్దకు చేరిన ఫైలు.. తెరపైకి పంచాయితీ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయనతోపాటు వచ్చిన మంత్రులు, అధికారులు, ఇతర వీపీఐల భోజనాల కోసం పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.32 లక్షలు! మొత్తంగా వంద మందికి భోజనాలు! అంటే ఒక్కొక్కరి భోజనానికి పెట్టిన ఖర్చు సగటున రూ.32 వేలు!! ఇదేదో బడాబాబుల ఇండ్లలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్ తాలూకా ఖర్చు అనుకుంటే పొరపాటు. ఇది సాక్షాత్తు వేములవాడ రాజన్న ఆలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించిన సందర్భంగా కేవలం భోజనాల కోసం పెట్టిన ఖర్చు! అక్కడ వంద మందికి భోజన ఏర్పాట్లు చేసిన హైదరాబాద్‌కు చెందిన హోటల్ తాజ్‌కృష్ణ నిర్వాహకులు ఆలయ అధికారులకు పంపిన బిల్లు ఇది. భోజనాలతోపాటు పట్టుపంచెలు, ఇతర మర్యాదల కోసం పెట్టిన మొత్తం ఖర్చు సింపుల్‌గా రూ.కోటీ 70 లక్షలు! ఇంత బిల్లు చెల్లించడం తమ వల్ల కాదని రాజన్న ఆలయ అధికారులు చెప్తుండగా, ఈ ‘పేమెంట్ చేయాల్సిందే’నంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక ఉన్నతాధికారి ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. దీంతో దిక్కుతోచని ఆలయ అధికారులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. నిత్యం కడుపు కాల్చుకొని పైసాపైసా కూడబెడుతున్నామని పదేపదే చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఖర్చుపై ఎలా స్పందిస్తారో మరి.
ఆలయ నిబంధనలూ మంట గలిపారు!
ప్రజాపాలన విజయోత్సవాల పేరిట గత నెల 20న వేములవాడలో కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు వేములవాడకు వచ్చారు. వీరితోపాటు ఇతర వీఐపీలకు అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికిన అధికారులు ఆ తర్వాత రాజన్న దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వంద మంది వీఐపీలకు భోజనాలు పెట్టేందుకు హైదరాబాద్ నుంచి తాజ్ హోటల్ సిబ్బంది వచ్చారు. దేవస్థానం చైర్మన్‌కు చెందిన చాంబర్‌నే ఫైవ్‌స్టార్ హోటల్‌గా మలిచి అక్కడే వండి భోజనాలు పెట్టారు. అందులోకి మీడియాను అనుమతించలేదు. కేవలం ఎంపికచేసిన వీఐపీలు మాత్రమే వెళ్లారు. దేవాలయానికి ఆనుకొని ఉన్న చైర్మన్ చాంబర్‌ను ఒక హోటల్‌గా మార్చడం నిబంధనలకు విరుద్ధం. సదరు హోటల్ నిర్వాహకులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పెట్టారు. మొత్తం వంద మంది వీఐపీలకు వంట చేసి భోజనాలు పెట్టినట్టు చెప్పిన సదరు హోటల్ యాజమాన్యం, అందుకు సంబంధించిన బిల్లులను తాజాగా రాజన్న ఆలయ ఈవోకు పంపినట్టు అలయ అధికారుల ద్వారా తెలిసింది. అందులో భోజనం ఖర్చు రూ.17 లక్షలు, ట్రాన్స్‌పోర్ట్, వెయిటర్, భోజనాల కోసం వేసిన డెకరేషన్ ఖర్చులు కలిపి రూ.15 లక్షలుగా పేర్కొన్నది. వంద మంది భోజనాల ఖర్చు కింద రూ.32 లక్షలు చెల్లించాలని పేర్కొంటూ బిల్లులు పంపారనేది అత్యంత విశ్వసనీయ సమాచారం. అంటే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులతో కలిపి చూస్తే ఒక్కో వీఐపీ ఆ రోజు చేసిన భోజనం ఖరీదు రూ.32 వేలు అన్నమాట!
10 వేలతో పట్టు పంచెలు?
సాధారణంగా ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రులు వచ్చినప్పుడు.. దేవాదాయ శాఖ కొన్ని సంప్రదాయాలు పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ అది శ్రుతి మించింది. తొలుత ముఖ్యమంత్రికి రూ.పది వేల విలువైన పట్టుపంచె, మంత్రులు, ఇతర వీఐపీలకు అంత కంటే తక్కువ ఖర్చుతో పట్టుపంచెలను తెప్పించినట్టు తెలిసింది. కానీ, జిల్లాకు చెందిన ఒక ఉన్నతాధికారి జోక్యం చేసుకొని, ముఖ్యమంత్రి తరహాలోనే మంత్రులకు, వీఐపీలకు కూడా పట్టుపంచెలు పెట్టాలని హుకుం జారీ చేయడంతో ఆలయ అధికారులు అప్పటికప్పుడు అదే ధరతో కూడిన పట్టువస్ర్తాలు తెప్పించినట్టు సమాచారం. అంతేకాదు, ముఖ్యమంత్రి వస్తున్నారని పేర్కొంటూ.. తాగే గ్లాస్ నుంచి తినే పల్లెం వరకు, కుర్చీ నుంచి టేబల్ వరకు.. ప్రతి వస్తువు కొత్తది తెప్పించినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకోసం సుమారు రూ.కోటి నలభై లక్షల వరకు వెచ్చించినట్టు తెలుస్తున్నది. అంటే ముఖ్యమంత్రి రాజన్న దర్శనానికి వచ్చిన సందర్భంగా భోజనాలు, ఇతర వస్తుల ఖరీదు కలసి రూ.కోటీ 70 లక్షలకుపైగా ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఇవన్నీ బహిరంగ సభ వద్ద జరిగిన ఖర్చులతో సంబంధం లేకుండా కేవలం ఆలయ ప్రాంగణ పరిధిలో జరిగిన ఖర్చులు మాత్రమేనని తెలుస్తున్నది.
తెరపైకి పంచాయితీ?
భోజన బిల్లులు రూ.32 లక్షలు కావడంతో అసలు పంచాయితీ తెరపైకి వచ్చినట్టు సమాచారం. ఈ బిల్లులు రాజన్న ఆలయం నుంచి చెల్లిస్తారని ఒక ఉన్నతాధికారి చెప్పిన మేరకు హోటల్ యాజమాన్యం రాజన్న ఆలయ ఈవోకు బిల్లులు పంపించింది. అయితే భోజనాలకు ఇంత పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించడం తమ వల్ల కాదంటూ దేవాలయ అధికారులు తేల్చిచెప్పగా.. జిల్లాకు చెందిన ఒక ఉన్నతాధికారి ‘లేదు.. లేదు. కచ్చితంగా చెల్లించాలి’ అని ఆదేశించినట్టు తెలుస్తున్నది. ఆలయ అధికారులు మాత్రం ఆ బిల్లులు చెల్లించకుండా.. ఫైల్ తయారుచేసి రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌కు పంపించినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫైలు కలెక్టర్ వద్ద పరిశీలనలో ఉన్నది. ఈ బిల్లులు కలెక్టర్ తన ఖాతా నుంచి చెల్లిస్తారా? లేక తిరిగి రాజన్న ఆలయానికి పంపిస్తారా? అనే అంశంపై చర్చ నడుస్తున్నది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ప్రొటోకాల్ పాటించడం సహజమే అయినా ఏకంగా ఫైవ్‌స్టార్ హోటల్‌నే దేవస్థానం పరిధిలోకి తెప్పించడం, లక్షల ఖర్చులతో భోజనాలు చేయడం ఎంతవరకు సమంజసమని దేవాలయ అధికారులే చర్చించుకుంటున్నారు. గతంలో అనేకమంది సీఎంలు వచ్చి వెళ్లారని, ఏనాడూ ఇటువంటి పరిస్థితి చూడలేదని ఆలయ వర్గాలు చెప్తున్నాయి. ఒక ఉన్నతాధికారి ఆదేశాల మేరకు అనుమతి లేకుండా కొనుగోలు చేసిన ఫర్నీచర్‌కు కూడా బిల్లులు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని అధికారులు లోలోన మధనపడుతున్నట్టు తెలుస్తున్నది. మొత్తంగా ఈ సమస్య ఎటువైపు దారితీస్తుందోనన్న ఆందోళన రాజన్న ఆలయ ఉద్యోగుల్లో వ్యక్తం అవుతుండగా.. వంద మంది వీఐపీలకు ఏకంగా రూ.32 లక్షలు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టడం అవసరమా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు.