అయ్యప్ప ఆలయంలో 18వ వార్షికోత్సవ వేడుకలు
అయ్యప్ప ఆలయంలో 18వ వార్షికోత్సవ వేడుకలు
అంబరాన్ని తాకిన స్వామి శరణు ఘోషలు
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి నవంబర్ 29:
దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా పేరొందిన గోదావరీ తీరస్థ ధర్మపురి పుణ్య క్షేత్రంలో జాతీయ రహదారికి పక్కన శ్రీమతి భీమనాతి మంగ, అశోక్ దంపతులు దాతలుగా, ధారాదత్తం
గావించిన స్థలంలో అయ్యప్ప భక్తుల సంకల్ప బలంతో, పదు నెనిమిది ఏళ్ల
క్రితం నవంబర్ మాసంలో రూపు దిద్దుకున్న అయ్యప్ప స్వామి ఆలయంలో, అయ్యప్ప స్వామి, శ్రీగణపతి, శ్రీసుబ్రహ్మణ్య స్వామి, మాలికా పురోత్తమ మాంజామాత సహిత ఆలయంలో శుక్ర వారం వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయాత్ పూర్వం 5 గంటలకు నిత్య పూజతో ప్రారంభించి, 7 గంటల నుండి అయ్యప్ప ఆలయం నుండి ప్రారంభించి, గురుస్వాముల ఆధ్వర్యంలో, లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మీదుగా ప్రధాన రహదారిపై గోదావరి నది వరకు దీక్షాపరులు దైవ ఉత్సవ విగ్రహాలు చేబూని రాగా, దీక్షా పరులైన భక్తులు అయ్యప్ప శోభా యాత్ర నిర్వహించారు.
జల యాత్రలో భాగంగా గోదావరి నదిలో వారుణోపనిషత్తు యుక్తంగా అభిషేకాదులు నిర్వహించి, పంచలోహ ఉత్సవ విగ్ర హాలను అభిషేకించి, చేత గైకొని, ఊరేగింపుగా అయ్యప్ప ఆలయానికి చేరు కున్నారు. గురుస్వామి పెండ్యాల బాలకృష్ణ శర్మ, కషోజ్జల రాజేశ్ శర్మ, తదితర యాజ్నికులు, గురు స్వాములు, అయ్యప్ప స్వాములు, దీక్షాపరులు, మండల ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విప్ లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం
శుక్రవారం అయ్యప్ప ఆలయం వార్షికోత్సవ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సహకారంతో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మణ్ కుమార్ స్వయంగా పాల్గొని స్వాములకు, భక్తులకు ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమంలో స్వయంగా భోజనాన్ని వడ్డించారు. కలిసి ఆరగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆలయానికి సంబంధించి కమాన్ నిర్మాణం తదితర అంశాలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, తప్పకుండా కమాన్ నిర్మాణంతో పాటు ఆలయ అభివృదికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని,ఆ మణికంఠుడి కరుణ కటాక్షాలు నియోజక వర్గ ప్రజానీకం పైన ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
హరిహర క్షేత్రంలో అంబర చుంబిత భక్తి పారవశ్యం
నిత్య భక్తజన సందడితో అలరారుతున్న ధర్మపురి క్షేత్రం, శుక్ర వారం అపర వైకుంఠపురియై అలరారింది. క్షేత్రంలో అయ్యప్ప స్వామి సహిత శ్రీగణపతి, శ్రీ సుబ్రహ్మణ్య మూర్తి, మాలికా పురోత్తమ మంజామాత సహిత నూతన నిర్మిత ఆలయంలో పదునెనిమిదవ వార్షి
కోత్సవ వేడుకలు నిర్వహించిన సందర్భంగా, దర్శనాభిలాషులై ఏతెంచిన నిత్య భక్తులతో నిండిన క్షేత్రం భక్తజన సంద్రమైంది. అయ్యప్ప స్వామి భక్తుల భక్తి పార వశ్యం అంబరాన్ని చుంబించింది. కార్తీక కృష్ణ పక్ష త్రయోదశి తో కూడిన చతుర్దశి యుక్త శుక్ర వారం పర్వదినాన గోదావరీ నదీస్నానాలకై ఉదయాత్పూర్వమే చేరుకున్న భక్తులు, అయ్యప్ప దీక్షా పరుల, నిత్యదర్శనాభిలాషుల మేలు కలయికతో క్షేత్రంలో భక్తి పారవశ్యం పొంగిపొర్లింది. అధిక సంఖ్యాకులైన భక్తులు ప్రధానాలయంలో నిత్య కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు దేవస్థానంలో విక్ర యించిన పులిహోర, లడ్డూలు ఇత్యాది ప్రసాదాలు, దేవస్థాన ఉచిత అన్నదాన కార్యక్రమం వినియోగించుకుని, అలసటలతో దేవాలయాల ప్రాంగణాలలోనే విశ్రమించారు. ధర్మపురి సిఐ రాం నర్సింహా రెడ్డి , ఎస్ ఐ ఉదయ్ కుమార్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.