పోలీసుల వేధింపులతో హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు
* స్టేషన్ లో బలవంతంగా రూ కోటి 60లక్షల చెక్కులపై సంతకాలు
పోలీసుల వేధింపులతో హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు
* చిలకలగూడ ఠాణాలోనే సివిల్ పంచాయితీ
* స్టేషన్ లో బలవంతంగా రూ కోటి 60లక్షల చెక్కులపై సంతకాలు
* పోలీసుల నుంచి కాపాడాలని బాధితుడి వేడుకోలు
పద్మారావు నగర్ నవంబర్ 17( ప్రజా మంటలు) :
చిలకలగూడ పోలీసులు వేధిస్తున్నారని పద్మారావు నగర్ చెందిన వ్యాపారి హైకోర్టును ఆశ్రయించాడు. ఒక కోటి 60 లక్షల చెక్కులను ఇతరుల పేరున బలవంతంగా పోలీస్ స్టేషన్ లోనే పంచాయతీ పెట్టి రాయించుకున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం పద్మారావునగర్ లో బాధితుడు పాతూరి ధర్మేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ....సెప్టెంబర్ 25న చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి తనను స్టేషన్ కు పిలిపించి, అక్కడ ఉన్న తన పాత వ్యాపారంలోని నలుగురు భాగస్వాముల సమక్షంలో వారికి రూ కోటి 60 లక్షలను ఇవ్వాలని , లేనిపక్షంలో తనపై, తన భార్య పై కేసులు పెడతానని బెదిరించారన్నారు.
అయితే 2021–2023 లో కొనసాగిన వ్యాపారంలో భాగస్వాములైన నలుగురితో లావాదేవీలన్నీ ముగిసిపోయాయని, తాను ఒక్క రూపాయి కూడ వారికి బాకీ లేనని, అప్పటి అగ్రిమెంట్ గడువు కూడ అయిపోయిందని చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదన్నారు. తన పేర స్టాంప్ పేపర్ తీసుకొచ్చి, పీఎస్ లోనే ఐదుగురికి రూ 32 లక్షల చొప్పున మొత్తం రూ కోటి 60 లక్షల విలువ చేసే ఐదు చెక్కులను తనతో బలవంతంగా రాయించుకున్నారన్నారు.
నిజానికి గత బిజినెస్ లో నలుగురు పార్టనర్లు ఉన్నారని, కాని రాఘవేంద్రారెడ్డి అనే వ్యక్తి కూడ రూ 32లక్షల చెక్కును తనపై రాయించుకొని, తీసుకెళ్ళాడని అన్నారు. సీఎం సోదరుడితో తమకు బాగా పరిచయం ఉందని అంటూ వీరు తనను బెదిరిస్తున్నారన్నారు. ఆ రోజున మధ్యాహ్నం స్టేషన్ కు పిలిపించిన తనను తన దగ్గర నుంచి మొబైల్ ను లాక్కొని అర్ధరాత్రి వరకు అక్కడే పోలీసులు ఉంచుకున్నారని తెలిపారు.
వాస్తవానికి తాను వారికి బాకీ లేనప్పటికీ పోలీసుల బెదిరింపులతో భయపడి చెక్కులు రాసి ఇచ్చానన్నారు. తన భార్యపై కేసు పెట్టి, స్టేషన్ కు తీసుకొస్తామని ఏసీపీ జైపాల్ రెడ్డి, సీఐ , డీఐ లు తనను బెదిరించారని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో ఫైనల్ సెటిల్ మెంట్ జరిగినట్లు బాండ్ పేపర్ లో కూడా రాశారన్నారు. బలవంతంగా చెక్కులు రాయించుకున్న అంశంపై తాను సిటీ సివిల్ కోర్టులో దావా వేశానన్నారు.
అయితే సిటీ సివిల్ జడ్జి సూచన మేరకు చిలకలగూడ పోలీసులపై సిటీ పోలీస్ కమిషనర్, డీజీపీ లకు ఫిర్యాదు చేశానన్నాడు. దాంతో తనపై కక్ష పెంచుకున్న చిలకలగూడ ఏసీపీ, సీఐ, డీఐ లు మూడు రోజుల క్రితం తన వైన్ షాప్ పర్మిట్ రూం లో జరిగిన కస్టమర్ల చిన్నపాటి గొడవకు తనను బాధ్యుడిని చేస్తూ, ఇటీవల తనను, తన సిబ్బందిని ఠాణాకు పిలుస్తూ, టార్చర్ చేస్తున్నారని ధర్మేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల వేధింపులు తాళలేక తాను శనివారం హైకోర్టును ఆశ్రయించి, పిటిషన్ దాఖలు చేశానని చెప్పాడు.
ప్రభుత్వం స్పందించి, చిలకలగూడ పోలీసుల నుంచి తనను, తన కుటుంబాన్ని కాపాడాలని పాతూరి ధర్మేందర్ రెడ్డి కోరారు.
––––––––––––––––