స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం - నాటి స్మృతులను స్మరించుకుంటున్న పూర్వ విద్యార్థులు.
(బియ్యాల విజయ్ కుమార్ - 9441122690).
నిర్మల్ 17 నవంబర్ (ప్రజా మంటలు) :
స్నేహం ఎంతో మధురం, కుటుంబ బంధాలకంటే ఉన్నతం, ఇలా ఎంతగా వర్ణించినా, అంతకంటే గొప్పదనం. బాల్యం నుంచి మొదలైన చెలిమి జీవితాంతం కలిసి సాగడం అదృష్టం. బతుకు బాటలో ఈ బంధానికి మించింది లేదు. ఇది నిజంగా అరుదు.. అంతటి మహోన్నత దోస్తానా కష్టమొచ్చినా నష్టమొచ్చినా వెన్నంటే నిలుస్తుంది. ఏతోడు లేకున్నా చేదోడుగా నిలిచేది కూడా అదొక్కటే అలాంటి స్నేహాభావాన్ని చాటడంలో భాగంగా నేడు నిర్మల్ పట్టణంలో 1971-1973 ఇంటర్ పూర్వవిద్యార్థుల సమ్మేళనం శ్రీకారం చుట్టింది.
స్నేహమేరా జీవితం. స్నేహమేరా శాశ్వతం అన్న సినీ కవి మాటలు అక్షరాల నిజం. రక్తం పంచుకుపుట్టిన వారి మధ్యగానీ భార్యాభర్తల మధ్య గానీ ఉండని ప్రేమాభిమానాలు స్నేహితుల మధ్య ఉంటాయని చెప్పడం అతిశయోక్తి కాదు. జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. వాటిని అన్నదమ్ములు, తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, చివరికి భార్యతో కూడా చెప్పలేం.. కానీ స్నేహితులతో పంచుకుంటాం. అందుకే స్నేహబంధం ఎంతో మధురం. ఒక వ్యక్తి యొక్క స్నేహితులను చూసి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు. స్నేహం మనిషి నిగ్గుతేల్చే గీటురాయి.
ఈ పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ఆనాటి విద్యార్థులు నేటి తరానికి ఆదర్శవంతులు.