డాక్టరేట్ పొందిన తుమ్మనపల్లి వాసి
సన్మానించిన మాజీ సర్పంచ్ గూడూరు ప్రతాపరెడ్డి
హర్షం వ్యక్తం చేసిన తుమ్మనపల్లి గ్రామస్తులు
హుజరాబాద్ సెప్టెంబర్ 7 (ప్రజామంటలు ప్రతినిధి దాసరి కోటేశ్వర్)
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న తుమ్మనపల్లి వాసి గొడిశాల పరమేశ్ కి ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జంతుశాస్త్ర విభాగంలో పీహెచ్డీ డాక్టరేట్ లభించింది. డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూనే పరిశోధన పట్ల ఉన్న ఆసక్తితో 2017 వ సంవత్సరంలో ఉస్మానియాలో పీహెచ్డీ పరిశోధక విద్యార్థిగా చేరారు. “మధ్యతరహా రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తి పెంపుదల ఉన్న అవకాశాలు మరియు సవాళ్లు౼ ఏ కేస్ స్టడీ ఆఫ్ రంగనాయక సాగర్ మరియు మిడ్ మానేర్ డ్యాం” అనే శీర్షికతో సీనియర్ ప్రొఫెసర్ రెడ్యానాయక్ పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధన గ్రంథానికి గాను పీహెచ్డీ పట్టా పొందారు. తుమ్మనపల్లి గ్రామంలో పుట్టి విద్యలో అత్యున్నత స్థాయి పట్టా అందుకున్న పరమేశ్ ను అతని తల్లిదండ్రులు మరియు గ్రామ మాజీ సర్పంచ్ గూడూరు ప్రతాపరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గూడూరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ, పరమేశ్వర్ ను ఆదర్శంగా తీసుకొని గ్రామ విద్యార్థులందరూ ఉన్నత విద్యలు అభ్యసించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ గ్రామస్తులు తనపై చూపిన ప్రేమ ఆదరభిమానాలకు ఆనందం వ్యక్తం చేస్తూ, మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తాను ఈరోజు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, తల్లిదండ్రులతోపాటు తన భార్య, అన్నదమ్ములు మిత్రులు కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.