భారీ వర్షాలకు ముత్తారం తండా రోడ్డు విచ్చిన్నం
ప్రభుత్వాలు మారిన తండా రోడ్డు పరిస్థితి మారలేదని తండావాసుల ఆవేదన
పాల క్యాన్లతో వర్షంలో రైతులు అవస్థలు
భీమదేవరపల్లి సెప్టెంబర్ 4 (ప్రజామంటలు) :
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇండ్లతో పాటు రహదారులు కొట్టుకుపోవడంతో చాలా గ్రామాలలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని చాలా తండాలకు ఇప్పటివరకు కనీస రోడ్డు సౌకర్యం లేకపోవడం శోచనీయం. ప్రభుత్వాలు మారిన తండాల పరిస్థితి మారడం లేదని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామ తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే మంగళవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ముత్తారం గ్రామం నుండి తండాకు వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయినది. దీంతో పాడి పరిశ్రమ మీద ఆధారపడిన తండా రైతులు పాలు పోయడానికి వాహనాల రాకపోకలు బంద్ కావడంతో బండ్ల మీద నాన్న ఇబ్బందులు పడుతూ పాలు పోసేందుకు అవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల రాజకీయ నాయకులు వాగ్దానాలు ఇవ్వడం, మర్చిపోవడం సర్వసాధారణమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి శాశ్వత ప్రాతిపదిక మీద తారు రోడ్డును వేయించాలని కోరారు.