ఉద్యమ తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను కాపాడుకొని విశ్వమంతా వ్యాపింపజేస్తాం - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు) :
ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ను, ఆదేశాలను ధిక్కరించి జగిత్యాల పట్టణంలో ఉద్యమ తెలంగాణ తల్లి ఏర్పాటుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూనుకున్నారు.
ఆదివారం నాడు భారీ ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి భూమి పూజ నిర్వహించారు.
ఆదివారం నాడు ఎమ్మెల్సీ కవిత జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ కార్యకర్తలు గజమాలతో ఘనస్వాగతం పలికారు.
అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ...
- ప్రభుత్వం ఎన్ని జీవోలు, గెజిట్ లు జారీ చేసినా ఉద్యమ తెలంగాణ తల్లినే తాము ప్రతిష్టించుకుంటామని తేల్చిచెప్పారు.
- కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యమకాలంలో తెలంగాణ తల్లి తమకు స్పూర్తిని ఇచ్చిందని, ధైర్యాన్ని నింపిందని తెలియజేశారు.
- ఉద్యమ తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను కాపాడుకొని విశ్వమంతా వ్యాపింపజేస్తామని తెలిపారు.
- తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదాడిని గ్రామ గ్రామాన ఎండగడుతామని అన్నారు. గ్రామ గ్రామాన ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టిస్తామని చెప్పారు.
జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత.
అక్కడ విద్యార్థినులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందితో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడతూ...
- కస్తూర్బా పాఠశాలలకు కూడా పెంచిన డైట్ చార్జీలను ప్రభుత్వం వర్తింపజేయకపోవడం బాధాకరమన్నారు.
- రాష్ట్ర వ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయని, పెద్ద సంఖ్యలో విద్యార్థులున్నారని, కాబట్టి ఈ పాఠశాలలకు కూడా పెంచిన డైట్ చార్జీలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
- కస్తూర్బా విద్యార్థినులకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని, ఈ విషయంపై రాజీ పడవద్దని ప్రభుత్వానికి సూచించారు.
- సర్వ శిక్ష అభియాన్ పథకం కింద పనిచేస్తున్న వారితో పాటు కస్తూర్బా పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను రెగ్యులరైజ్ చేస్తానని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, వెంటనే ఆ హామీని అమలు చేసి టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
- గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో జూనియర్ కాలేజీని మంజూరు చేయాలని స్థానికులు కోరారని, దాంతో అప్పటి సీఎం కేసీఆర్ జూనియర్ కాలేజీని మంజూరు చేశారని, త్వరలో అది ప్రారంభమవుతుందని చెప్పారు.
- కేసీఆర్ ఏ లక్ష్యంతో అయితే గురుకుల పాఠశాలల పెట్టారో ఆ లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవరించిందని, దానికి ప్రతిచర్యగా బీఆర్ఎస్ ఉద్యమిస్తోందని అన్నారు.
- బీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యమాల వల్ల ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచడం, నూతన డైట్ మెనూను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.
మరోవైపు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ....
- సంజయ్ పార్టీ మారినా కూడా ప్రజలు కేసీఆర్ తో , బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారని స్పష్టం చేశారు.
- రాహుల్ గాంధీ వచ్చి జగిత్యాలలో ప్రచారం చేసినా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి అయిన సంజయ్ కుమార్ ను ప్రజలు గెలిపించారని, అంటే ఇది సంజయ్ వ్యక్తిగత గెలుపు కాదని, కేసీఆర్ గెలుపుగా చూడాలని సూచించారు.
- నాయకులు పార్టీ మారినంత మాత్రానా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని, బీఆర్ఎస్ కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారని తెలిపారు.
- రానున్న రోజుల్లో గులాబీ జెండాను ఎగరేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంత, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపి రెడ్డి , దావ సురేష్ తదితరులు పాల్గొన్నారు.