అరాంఘర్ - జూపార్క్ వంతెనకు మన్మోహన్ సింగ్ పేరు - ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
అరాంఘర్ - జూపార్క్ వంతెనకు మన్మోహన్ సింగ్ పేరు - ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 06:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోగానీ హైదరాబాద్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 11 కిలోమీటర్ల అత్యంత పొడవైన స్వర్గీయ పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ నిర్మితమైతే, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కిలోమీటర్ల మేర రెండో అతిపొడవైన స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ ను నిర్మించామని, తద్వారా తమకు తామే పోటీ అని నిరూపించుకున్నట్టయిందన్నారు.
నూతనంగా నిర్మించిన ఆరాంఘర్-జూపార్క్ 4కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ , స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్ తొ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
అలాగే చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలో రూ.301 కోట్లతో సీవరేజ్ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.
🔷 ఆరాంఘర్- జూపార్క్ ఫ్లైఓవర్‌కు దివంగత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పెరు పెడుతున్నట్లు హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రి ప్రకటించారు.
🔷 "హైదరాబాద్ నగర అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి. హైదరాబాద్ అభివృద్ధి కోసం రోడ్ల విస్తరణ, మెట్రో రైలు విస్తరణ, గోదావరి జలాలు తేవడం ద్వారా తాగునీటి సమస్యల పరిష్కారం, మూసీ పునరుజ్జీవం శాంతి భద్రతల పరిరక్షణ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక కార్యక్రమాలు తీసుకుని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్నామని అన్నారు.
🔷 హైదరాబాద్ నగరానికి లేక్స్ అండ్ రాక్ సిటీగా ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు ఉంది. ఆనాడు నిజాం చేసిన అభివృద్ధిని పరిరక్షించుకొని ఉండుంటే ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ తో పోటీ పడే నగరమే ఉండకపోయేది. కానీ కాలక్రమేణా కబ్జాదారులు, ఆక్రమణల వల్ల నగర సుందరీకరణ పూర్తిగా దెబ్బతిన్నది. ఈరోజు నగరంలో చిన్న వర్షం వచ్చినా వరదలు వస్తున్నాయి, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
🔷 ఎన్నికల సమయంలోనే రాజకీయాలు. ఎన్నికల తర్వాత అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచన. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంఐఎంతో కలిసి పనిచేస్తాం.
🔷 ఈ రోజు ప్రారంభమైన చర్లపల్లి టర్మినల్ చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఒక పెద్ద రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేసేందుకు అవసరమైన భూమి సేకరణ, ఇతర అనుమతుల పనులన్నీ పూర్తి చేశాం.
🔷 చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో మాట్లాడాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 10 ఏండ్ల పాటు మెట్రో రైలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న విషయాన్ని గుర్తుచేశాను.
🔷 ముఖ్యంగా గౌలిగూడ, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట వరకు సుమారు 7.5 కిలోమీటర్ల మెట్రో పనులు ఏకంగా ఒక్క ఇటుక కూడా వేయలేదు. అందుకే హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను గురించి చెప్పి కేంద్ర మంత్రిమండలి ఆమోదించాల్సిందిగా అభ్యర్థించాను.
🔷 ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం కూడా అత్యవసరం. రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రీజినల్ రింగ్ రోడ్‌తో పాటు, రీజినల్ రింగ్ రైలును కూడా కేంద్రాన్ని కోరాం. వికారాబాద్ – కొడంగల్ - కృష్ణా రైల్వే లైన్ కూడా కోరాం.
🔷 తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలుస్తా, ఎవరితోనైనా పోరాడుతా. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం నా శక్తివంతమైన కృషిని కొనసాగిస్తాను.
🔷 హైదరాబాద్ నగరానికి సంబంధించి కొన్ని అంశాలపై మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక డాక్యుమెంట్ తయారు చేసారు. కొద్దిరోజుల్లోనే హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు సంబంధిత అధికారులతో ఒక సమావేశం నిర్వహిస్తాం.
🔷 హైదరాబాద్ పాత నగరం నిజానికి ఓల్డ్ కాదు.. ఒరిజినల్ సిటీ.. ఇది అసలైన నగరం. అందుకే మా ప్రభుత్వం ఒరిజినల్ సిటీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది."