గోదావరి మహా హారతికి ఏర్పాట్లు వివిధ పీఠాధితులతో ఏటా మహా హారతి
గోదావరి మహా హారతికి ఏర్పాట్లు
వివిధ పీఠాధితులతో ఏటా మహా హారతి
+రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494)
ధర్మపురి నవంబర్ 29:
గోదావరి జీవనది కేంద్ర బిందువుగా, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనాన్ని పునర్మించడమే ధ్యేయంగా దక్షిణ కాశీగా పేరొందిన గోదావరి తీరస్థ ధర్మపురి క్షేత్రంలో ఈనెల 30వతేదీ శని
వారం రాత్రి గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గోదావరి హారతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో,
పరందామాశ్రమ స్వామి పరబ్రహ్మ నందగిరి స్వాముల వారు, చండీ ఉపాసకులు, పాలెం మనోహర శర్మ ప్రత్యక్ష భాగస్వామ్యంతో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు పోల్చాని మురళీధర్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రపంచంలోని అతి పెద్ద నదులలో గోదావరి ఒకటి. గోదావరి జల సంపద ప్రపంచం లోని అత్యంత పొడవైన నైలునది కన్నా ఎక్కువ. గోదావరి సరాసరి పరిమాణం 4000 టిఎంసిలు. మహారాష్ట్ర లోని సహ్యాద్రి పర్వత శిఖరాలలో 1500 అడుగుల ఎత్తున పుట్టిన గోదావరి మహా రాష్ట్రలో 491 మైళ్ళు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 470మైళ్ళు ప్రవహిస్తూ సముద్రాన్ని చేరుతున్నది. బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, పర్ణశాల, భద్రాద్రి, ద్రాక్షారామం దాటి, సాగరాన్ని సంగమిస్తుంది. గౌతమ మహర్షి తపస్సు చేత "గౌతమి"గా, గోహత్యా పాతకం పోగట్ట బడటం చేత "గోదావరి"గా పిలువబడే ఈ నది పార్శ్వ భూమియందు 100ఏళ్ళు శాంతి సౌభాగ్యాలు అందించిన శాతవాహన సామ్రాజ్యం విలసిల్లింది. కాకతీయ, చాళుక్య సామ్రాజ్యాల ఏలుబడిలో వర్ధిల్లింది. గోదావరి పార్శ్వ భూమిలోనే తొలి మాట పుట్టింది. తెనుగు సాహిత్యం భారతికి నీరాజనాలెత్తింది. వ్యవసాయం, పాడి పంటలకు గోదారే ఆధారం. గోదావరి లేకుండా మన మనుగడ లేదు. సంస్కృతి లేదు. వికాసం లేనేలేదు. అందుకే పర్యావరణ సంరక్షణ నేపథ్యంలో గోదావరిని రక్షించు కోవాలనే దృఢ సంకల్ప కారణంగా గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని 2012 నవంబర్ లో కార్తీక పూర్ణిమ రాత్రి మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి ఉమా భారతి, 2012లో విశాఖ శ్రీపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామి, 2014లో ప్రస్తుత ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్, 2015లో గణపతి సచ్చితానంద సరస్వతీ స్వామి. 2016లో హరిద్వార్ మహామండలేశ్వర కైలాసానంద స్వామీజీ, అమరావతి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివస్వామి, 2017లో శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామి, శ్రీమాధవానంద సరస్వతి స్వామి సమక్షంలో నిర్వహించగా 2018లో, హిమాలయ మహా మండలే శ్వర ఉమాకాంత నందన స్వామీజీ భాగస్వామ్యంతో వైభవంగా నిర్వహించారు. 2019లో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి, ఉత్తరాఖండ్ సంపూర్ణానంద బ్రహ్మచారి మహారాజ్ స్వామి, 2020లో కోవిడ్ కారణంగా గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని నిబంధనలకు లోబడి చండీ ఉపాసకులు పాలెం మనోహర శర్మ సమక్షంలో నిర్వహించారు. 2021లో తుని (ధర్మపురి శ్రీ మఠం) పీఠాధిపతి పరమ హంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి ప్రత్యక్ష భాగస్వామ్యంతో, చండీ ఉపాసకులు, పాలెం మనోహర శర్మ సమక్షంలో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు పోల్సాని మురళీధర్ రావు ఆధ్వర్యంలో గోదావరి మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. 2022 నవంబర్ 21వ తేదీ సోమవారం సాయంత్రం పరందామాశ్రమ స్వామి పరబ్రహ్మ నందగిరి స్వాముల వారు, చండీ ఉపాసకులు, పాలెం మనోహర శర్మ ప్రత్యక్ష భాగస్వామ్యంతో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు పోల్చాని మురళీధర్ రావు ఆధ్వర్యంలో మహా హారతి నిర్వహించారు.
ఈ ఏడు ప్రధానంగా...పూజ్యశ్రీ అతిథేశ్వరానంద పర్వత శ్రీ అద్వైత పీఠం, శ్రీలంక విశ్వహిందూ మహాసంఘ్ భారత్ కర కమలములచే, ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు పోల్చాని మురళీధర్ రావు ఆధ్వర్యంలో,
గోదావరి తీరాన కన్వీనర్ వీర గోపాల్, కో కన్వీనర్ దామెర రాం సుధాకర్, బల్గూరి సంతోష్ రావు, జిల్లా అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్, వి హెచ్ పి తెలంగాణ అధ్యక్షులు వీరన్నగారి సురేందర్ రెడ్డి, జిల్లా బాధ్యులు సంగి నర్సయ్య తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రముఖ యాజ్నికులు పౌరాణికులు పాలెపు భరత్ శర్మ అదిగా పండితులచే సంకల్పం, పుణ్యాహ వాచనం, నవగ్రహ హోమాలు, అభిషేకం, రుద్రాభిషేకం, సూక్త హోమాలు, రుద్ర హోమం, పూర్ణాహుతి తదితర క్రతువులు నిర్వహించ తలపెట్టిన, పొల్సాని మురళీధర్ రావు దంపతులు కర్తలుగా పాల్గొనే సాంప్రదాయ కార్యక్రమాలకు ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర కన్వీనర్ దామెర రాం సుధాకర్ వివరించారు.