క్షీణించిన సోనియా గాంధీ ఆరోగ్యం - తల్లితోపాటు ప్రియాంక గాంధీ - బెలగావ్ సి డబ్ల్యూ సి సమావేశాలకు దూరం
క్షీణించిన సోనియా గాంధీ ఆరోగ్యం - తల్లితోపాటు ప్రియాంక గాంధీ - బెలగావ్ సి డబ్ల్యూ సి సమావేశాలకు దూరం
న్యూ ఢిల్లీ డిసెంబర్ 26:
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు,రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ (78) అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోనియా చికిత్స పొందుతున్నారు. తల్లి సోనియా వెంట ప్రియాంకాగాంధీ ఉన్నారు. ఇదిలా ఉంటే గురు,శుక్రవారాల్లో కర్ణాటకలోని బెలగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి.
ఈ సమావేశాలకు సోనియా, ప్రియాంక హాజరుకావల్సి ఉంది. కేవలం రాహుల్‌గాంధీ మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు. సోనియా ఆరోగ్యం కుదిటపడితే సమావేశానికి వెళ్లొచ్చు. లేదంటే తల్లితో పాటు ప్రియాంక కూడా భేటీకి దూరంగా ఉండే అవకాశం ఉంది.
కర్ణాటకలోని బెలగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి నవ సత్యాగ్రహ భైఠక్‌గా నామకరణం చేశారు. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలతో పాటు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారు. మొత్తంగా 200 మంది కీలక నేతలు ఈ మీటింగ్‌లో పాల్గొంటారని ఏఐసీసీ వెల్లడించింది.
మహాత్మాగాంధీ నగర్లో గురువారం మధ్యాహ్నం సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. డిసెంబర్ 27 ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ రెండు తీర్మానాలు ఆమోదించనుంది. వచ్చే ఏడాది పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణపై కూడా కీలక చర్చ జరపనున్నారు. ఇక ఈ భేటీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గురించి కూడా చర్చించనున్నారు.