ధనురాసోత్సవాలకు వేదిక అయిన ధర్మపురి క్షేత్రం
ధనురాసోత్సవాలకు వేదిక అయిన ధర్మపురి క్షేత్రం
డిసెంబర్ 16 నుండి ఉష: కాల పూజలు
ప్రారంభం
(రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494)
గోదావరీ తీరస్థ ప్రాచీన పుణ్య తీరమైన ధర్మపురి క్షేత్రం ధనుర్మాస ఉత్సవ వేడుకలకు వేదిక అయింది. దేవస్థానంలో ఉగ్ర, యోగానంద లక్ష్మీ సమేత నరసింహ, శ్రీ వేంకటేశ్వర దేవాలయాలతో పాటు గోదావరీ తీరస్త శ్రీరామాలయం, సంతోషి మాత, సాయి బాలాజీ మందిరాలలో ఈ నెల 16వ తేదీనుండి జనవరి 14వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్న ధనుర్మాస ప్రత్యేక ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు గావిస్తున్నారు. చైత్ర, వైశాఖ మాసములు, పాడ్యమి, విదియాది తిధులను చాంద్ర మానమును అనుసరించి లెక్కించడం జరుగుతుంది. ఔత్తరాహికులు బార్హస్పత్య మానమును అనుసరిస్తే, దక్షిణాత్యులు సౌర మానమును పాటించడం పరిపాటి. సూర్యోదయాస్తమయాదులు సౌర మానమునకు ఆధారములు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించి, ఉండు నెల రోజులు అయా మాసములుగా గుర్తించ బడినవి. ఒక్కొక్క మాసము ఒక్కొక్క సంక్రాంతిగా చెప్పబడు చున్నది. నాగర ఖండ ప్రమాణము గానే మకర సంక్రాంతి (జనవరి 14) మొదలు కొని కర్కాటక సంక్రాంతి (జాలై 10) వరకు ఉత్తరాయణము, తదాది మరల మకర సంక్రాంతి వరకు దక్షిణాయనముగా చెప్ప బడింది. ఇది మానవులు అనుసరించు కాలము కాగా, మానవులకు ఒక సంవత్సర ప్రమాణ కాలము దేవతలకు ఒక అహోరాత్రమైన దివసముగా పేర్కొన బడినది. అందున ఉత్తరాయణము దినము కాగా, దక్షిణాయణము రాత్రి భాగమగుచున్నది. ధనుస్సంక్రమణమైన మాసము దేవతలకు ఉష:కాలముగును. అందుకే బ్రాహ్మీ ముహూర్తము నందు మేల్కొనాలి. అదే ప్రకారం దేవతలకు కూడా ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్త కాల మగు చున్నది. ఇట్టి సమయాన దేవతార్చన చాలా విశిష్టమైనదని స్పష్టమగు చున్నది. ముల్లోకాధిపతి యైన మహా విష్ణువు ఆషాఢము మొదలుకుని కార్తీకము వరకు నిదురించునని అట్టి భగనుని సూర్యుడు ధనుర్రాశి లో ప్రవేశించిన పిదప విష్ణు సంబంధమైన స్తోత్రాలతో మేల్కొలిపి , ఉష: కాల మందు శోడపోపచారములచే పూజించి, ముద్గాన్నము (పులగం), పొంగలి, చక్కెర పొంగలి) నివేదనం చేయాలి. సూర్యోదయం కన్నా ముందే ఉష: కాలమున అరుణోదయ సమయమున విష్ణుమూర్తిని నెల రోజులు పూజించాలని, అరుణోదయము అనగా ఉదయమునకు పూర్వము నాలుగు ఘటియలని, ఒక ఘటియ ఇరువది నాలుగు నిమిషములని, గంటన్నర పూర్వముగా స్కంద పురాణం వివరిస్తున్నది. ఈ నేపధ్యంలో ధర్శపురి క్షేత్ర విష్ణు సంబంధ ఆలయాలలో ఆనాదిగా, ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు ఆచరించడం సత్సంప్రదాయంగా మారింది. నెల రోజుల పాటు ఉదయాత్పూర్వం వివిధ ఆలయాలలో అభిషేకాలు, అర్చనలు, పూజలు, నిత్య కళ్యాణ సేవలను నిర్వహించేందుకు వలసిన ఏర్పాటును గానిస్తున్నారు. జనవరి 10
న వైకుంఠ ఏకాదశి తదితర ఉత్సవాలు, రంగ నాథుల కళ్యాణాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించ నున్నారు.
సీతారామాలయంలో వేడుకలు
సనాతన సాంప్రదాయాల సరియైన గోదావరి తీరాన ధర్మపురి క్షేత్రంలో డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్న ధనుర్మాసోత్సవ వేడుకల కోసం గోదావరి నది తీరాన వెలసిన శ్రీరామాలయంలో ప్రత్యేక ఏర్పాటు గావించారు. దక్షిణాభిముఖియై ప్రవహిస్తూ, విశేష ప్రాధాన్యతను సంతరించుకున్న పరమ పావనమైన గోదావరి నది తీరాన వెలసిన క్షేత్రంలోని అతి ప్రాచీన రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లను గావించడంలో నిర్వాహకులు నిరంతర నిమగ్న మైనారు. శ్రీరామాలయంలో దేశంలో వేరెచ్చటా లేని విధంగా, నల్ల శనపు రాతిపై సమంశ పద్ధతిలో చెక్క బడిన శ్రీరామ చంద్ర మూర్తికి మీసాలుండడం ఈ కోవెల విశేషం. పూర్వాభిముఖులైయున్న సీతారామ ఏక శిలా విగ్రహం, ప్రభపై దశావతారాలు, చత్రదారిగా భరతుడు, వింజామర వీస్తూ శత్రుజ్ఞుడు, అనంత పద్మనాభ స్వామి, ఇరువురు దేవేరులతో కూడిన వేంకటేశ్వర, శివ పంచాయ తనాలతో శోభీల్లుతున్నది దేవాలయం. సూర్యుడు దనుర్రాశి లో ప్రవేశించి, ధను సంక్రమణం కలుగు తున్నందున, దేవస్థాన పండిత వర్గ నిర్ణయం మేరకు 16వ తేదీ నుండి నెల రోజుల పాటు ఈ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించ డానికి వలసిన ఏర్పాట్లు చేశారు. వంశ పారంపర్య అర్చకులు, జ్యోతిష్కులు దివంగత తాడూరి శివ రామయ్య ప్రారంభించి, రాష్ట్ర ఇతర ప్రాంతాలలో పురాణ ప్రవచనాలతో శిష్య సాంప్రదాయాన్ని కలిగిన కీర్తి శేషులు తాడూరి బాలకృష్ణ శాస్త్రి కొన సాగించిన, ఉత్సవాలను ఏటా ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం ఆనవాయితి.
దేవస్థానం వేళల్లో మార్పులు
డిసెంబర్ 16న సాయంత్రం ధనుర్మాసం ప్రారంభం కానున్నందున ధర్మపురి క్షేత్రంలో ఈనెల 16వ తేదీ నుండి విష్ణు సంబంధ ఆలయాలలో నెల రోజులపాటు ఉదయాత్పూర్వం నిర్వహించనున్న ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా సంబంధిత ఆలయాల వేళలలో మార్పులు చేయనున్నట్లు చేస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
మార్గశిర మాసం ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 16వ తేదీ ప్రారంభమై జనవరి14 వరకు ప్రతినిత్యం ఉదయం 3-00 గంటలకు దేవాలయం తెరచి 3-45 గంటలకు అన్ని దేవాలయంలలో అబిషేకం ప్రారంభించబడునని, అలాగే 8-00 గంటలనుండి 2-30 గంటలవరకు అర్చనలు, హారతి టికెట్లు భక్తులకు ఇవ్వబడునని, తిరిగి 4-౦౦ గంటలనుండి రాత్రి 6-00 గంటల వరకు అర్చనలు, హరతి టికెట్స్ భక్తులకు ఇవ్వబడునని తెలిపారు. సాయంత్రం 6-00 గంటలనుండి రాత్రి 7-00 గంటల వరకు స్వామి వారికి ఆరాధన, నివేదన కార్యక్రమంలు చేసి దేవాలయం మూసివేయ బడునని ఈఓ శ్రీనివాస్ వివరించారు.