ధర్మపురిలో వైభవంగా దత్త జయంతి
ధర్మపురిలో వైభవంగా దత్త జయంతి
(రామ కిష్టయ్య సంగన భట్ల)
గోదావరి తీరస్త ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలో శని వారం దత్తాత్రేయ జయంతి వేడుకలు వైభవంగా, నయనానందంగా జరిగాయి. ప్రాచీన ఆర్ష విద్యా ప్రచార కేంద్రంగా, వేద సంస్కృతికి నిలయంగా అనాదిగా వినుతికెక్కిన, గోదావరి తీరంలో వెలసిన శ్రీ దత్తాత్రేయ దేవాలయంలో మార్గశిర పౌర్ణమి శని
వారం పవిత్ర దినాన దత్తాత్రేయ జన్మతిథి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. త్రిమూర్తుల స్వరూపుడు, త్రిముఖ దేవుడు అయిన దత్తాత్రేయ దివ్యమంగళ పాలరాతి దర్శనామూర్తి గల ఈ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా, దత్త జయంతి వేడుకల్లో భాగంగా వంశపారంపర్య అర్చకులు ద్యారం నిరంజన్, గురు ప్రసాద్, ప్రదీప్,
గణేష్, అశ్విన్, ఆత్రేయ ఆధ్వర్యంలో స్థానిక వేద విధులు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం పంచోపనిషత్ నమక చమక రుగ్వేద పవమాన సూక్త ఉపనిషత్ వేదోచ్చరణల మధ్య మహన్యాస పూర్వక రుద్రాభిషేక పూజలు సాయంత్రం 5 గంటల నుండి దివ్యదర్శనం, మహిళలచే గురు చరిత్ర పారాయణం,
రాత్రి 7 గంటలకు తొట్టి ఉత్సవం, 9 గంటలకు వేద పండితులచే వేద ఘోష, మహామంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణం, మహాదాశీర్వచనం, 10 గంటలకు సుప్రసిద్ధ పండితులు కశోజ్జల శేఖర్ శర్మ గురుచరిత్ర, పురాణ కాలక్షేపం అనంతరం సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయంలో భక్తులు రాత్రంతా భగవన్నామ స్మరణతో జాగరణ చేశారు. ఉదయాత్పూర్వం నుండి గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించిన భక్తజనం తీరాననే ఉన్న దత్త ఆలయంలో దైవ దర్శనాలు చేసుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ లో దత్తాత్రేయ హవన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
రామలింగేశ్వరాలయంలో..
లక్ష్మీనర్సింహస్వామి దేవస్థాన పరిధిలోని రామలింగేశ్వరాలయంలో రొట్టె బాలకిష్టయ్య-భాగ్యలక్ష్మి మరియు శ్రీనివాస్-సరిత కుటుంబీకులచే ప్రతిష్ఠిత దత్త మందిరంలో. మంగళ వారం నవరాత్రి వేడుకల ముగింపు, దత్త జయంతి కార్యక్రమాలను బొజ్జా రాజ గోపాల్ శర్మ, దేవళ్ల విశ్వనాథ శర్మ ఘనంగా నిర్వహించారు.
క్షేత్రంలో భక్తజన సందోహం
ధర్మపురి క్షేత్రం శని వారం భక్తజన సందోహంతో కళకళ లాడింది. అత్రి, అనసూయలకు త్రిమూర్తుల అంశతో ఆరుచేతులు, మూడు తలలు-నడిమి విష్ణువు-కుడిది శివుడు, ఎడమది బ్రహ్మ శిరములతో గొప్ప సన్యాసైన దత్తత్రేయుడు మార్గశిర శుక్ల చతుర్దశి కృత్తిక నక్షత్రంలో జన్మించడం జరిగింది. శని వారం పౌర్ణమి కలిసి వచ్చిన వేళ, దూరప్రాంత భక్తులు స్థానికులు గోదావరిలో మంగళస్నానాలు ఆచారించి, దైవదర్శనాలు చేసుకున్నారు.