కొత్తకొండ కోరమీసాల వీరభద్రస్వామి కళ్యాణం కమనీయం
అశేష భక్తజనం మధ్యలో కన్నుల పండుగగా కళ్యాణం
పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్త దంపతులు
భీమదేవరపల్లి జనవరి 10 (ప్రజామంటలు) :
ఉత్తర తెలంగాణలో ప్రసిద్ది గాంచిన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో కొలవైన వీరభద్రుడి జాతర బ్రహ్మోత్సవాలు శుక్రవారం భద్రకాళీ సమేత వీరభధ్రుడి కళ్యాణంతో అధికారికంగా ప్రారంభమయ్యాయి. కొత్తకొండ కోర మీసాల వీరభద్రుడి కళ్యాణం ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరంలో శుక్రవారం రాత్రి కన్నులపండువగా నిర్వహించారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని జరిగే బ్రహ్మోత్సవాలు స్వామివారి కళ్యాణంతో ప్రారంభమయ్యయి. తొలుత ఆలయంలో ధ్వజారోహణం నిర్వహించి వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవ మూర్తులను పల్లకిలో తీసుకుని వచ్చి కళ్యాణ మండపంలో అందంగా అలంకరించారు. ఆలయ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా సతీసమేతంగా హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించగా ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ధ్యాన మండపంలో ఏర్పాట్లు చేయగా వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ దేవతామూర్తుల అర్చకులు కళ్యాణ ఘట్టం పూర్తి చేశారు. దీంతో భక్తులు ఆ అపూర్వ ఘట్టాన్ని దర్శించుకుని పులకరించిపోయారు. భద్రకాళీ, వీరభద్రస్వామి వారి ప్రాశస్థ్యాన్ని వేద పండితులు భక్తులకు వివరించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. దీంతో ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నం సతీమణి మంజుల, మామ పెద్ది వెంకట నారాయణ గౌడ్, వెంకటాపూర్ ఎంపీడీవో లంకపల్లి భాస్కర్, సిఐ పులి రమేష్, ఎస్సైలు సాయిబాబు, దివ్య, డైరెక్టర్స్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.