తిరుమల దర్శనానికి ఐఏ సాంకేతిక
తిరుమల దర్శనానికి ఐఏ సాంకేతిక
టీటీడీ ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలు
తిరుమల నవంబరు 19 :
టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వివరించారు.
- ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు నిర్ణయం.
- టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం.
- తిరుమలలో డంపింగ్ యార్డులోని చెత్తను మూడు లేదా నాలుగు నెలల్లో క్లియర్ చేయాలని నిర్ణయం.
- తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చడానికి నిర్ణయం.
- అలిపిరిలో టూరిజం కార్పోరేషన్ ద్వారా దేవలోక్ కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం.
- తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
- తిరుపతి స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం.
- శ్రీవాణి ట్రస్టు పేరును మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్టు ఇవ్వాలని ఆదేశం.
- ప్రయివేటు బ్యాంకుల్లో డిపాజిట్లను వెనక్కు తీసుకుని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నిర్ణయం. ఈ అంశంపై వచ్చే సమావేశంలో చర్చిస్తాం.
- నిత్య అన్న ప్రసాద భవనం మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేర్చేందుకు నిర్ణయం.
- వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పోరేషన్లు, ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300/-) టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు నేపథ్యంలో వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం సదరు సంస్థలకు కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం.
- తిరుమలలో గోగర్భం డ్యామ్ వద్ద విశాఖ శ్రీ శారద పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు, ఆక్రమణలు జరిగినట్లు టిటిడి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భవనం లీజును రద్దు చేయాలని నిర్ణయం.
- బ్రహ్మోత్సవాలలో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు గత సంవత్సరం ఇచ్చిన బ్రహ్మోత్సవ బహుమానాన్ని 10 శాతం పెంచాలని నిర్ణయం. తద్వారా రెగ్యులర్ ఉద్యోగులకు రూ.15,400/-, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535/- బ్రహ్మోత్సవ బహుమానం.
- శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణకు, అన్న ప్రసాద కేంద్రం ఆధునీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ. ఈ పనులు ఉచితంగా చేయనున్న టీవీఎస్ సంస్థ.