సర్కార్ భూమి ఆక్రమణ పై కాంగ్రెస్ ఆందోళన
సర్కార్ భూమి ఆక్రమణ పై కాంగ్రెస్ ఆందోళన
సికింద్రాబాద్, ఫిబ్రవరి 01 ( ప్రజామంటలు):
సర్కారి భూమి ఆక్రమణపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు.
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్ పేట్ డివిజన్ లో గల బాపు నగర్ బస్తీలోని 125 చ.గ. ప్రభుత్వ భూమిలో 85 చ.గ. ఆక్రమణకు గురైందని అమీరుపేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.ఎస్.రావు ఆవేదన వ్యక్తంచేసారు. ఈ భూమిని ప్రజా మరుగుదొడ్ల కోసం ప్రభుత్వం కేటాయించింది. భూమి కబ్జా విషయమై బస్తీవాసులకు అన్యాయం జరిగిందని ఎస్.ఎస్.రావు అన్నారు. ఈ విషయం పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, 125 చ.గ.లో 85 చ.గ. ఆక్రమణపై దర్యాప్తు చేయాలని, పూర్తి పునఃసర్వే చేయించి ఆక్రమించబడిన భూమిని ప్రభుత్వం తిరిగి రికార్డులలోకి తీసుకోవాలని, బస్తీవాసులకు న్యాయంచేయాలని కోరారు.
అమీరుపేట్ డివిజన్ బిజెపి కార్పోరేటర్ ఈ భూమి పై నీటి ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడంపై కూడా కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. భూమి సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఈ ప్రణాళికలను ఆపాలని ఎస్.ఎస్.రావు మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజా మరుగుదొడ్లు అవసరమా లేదా నీటి ప్లాంట్ అవసరమా అని బాపు నగర్ లోని కుటుంబాల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని, ప్రజల మెజారిటీ అభిప్రాయం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ నాయక్, కృష్ణకుమార్, నరేష్, పద్మావతి, ఆండాళు, నవీన్ రాజ్, రవి పాల్గొన్నారు.