కిడ్నీ బాధితులను విచారించిన త్రిసభ్య కమిటీ - గాంధీలో కోలుకుంటున్న నలుగురు బాధితులు
కిడ్నీ బాధితులను విచారించిన త్రిసభ్య కమిటీ
* సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో విచారణ వేగవంతం
* గాంధీలో కోలుకుంటున్న నలుగురు బాధితులు
సికింద్రాబాద్, జనవరి 22 ( ప్రజామంటలు ) :
సిటీలోని అలకానంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ ఘటనపై త్రిసభ్య కమిటీ గాంధీ ఆసుపత్రిని సందర్శించింది...వివరాలు ఇలా ఉన్నాయి. ఎలాంటి పర్మిషన్ లేకుండా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తు లక్షల్లో దోపిడికి పాల్పడుతున్న సరూర్‌నగర్‌లోని అలకానంద ఆస్పత్రి నిర్వాహకుల దోపిడిని పోలీసులు, వైద్యాధికారులు ఆటకట్టించి, అలకానంద ఆస్పత్రిని సీజ్ చేసి, అక్కడ చికిత్స పొందుతున్న ఇద్దరు డోనర్స్, మరో ఇద్దరు రిసీవర్లను మంగళవారం రాత్రి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించిన సంగతి విదితమే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నాగేందర్, ఉస్మానియా నెఫ్రాలజీ, యూరాలజీ హెచ్‌ఓడీలు ప్రొఫెసర్ కిరణ్మయి, ప్రొఫెసర్ మల్లిఖార్జున్‌లతో త్రిసభ్య విచారణ కమిటిని నియమించింది. కమిటి సభ్యులు బుధవారం మధ్యాహ్నాం గాంధీ దవఖానుకు చేరుకుని ముందుగా గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజకుమారితో సమావేశం అయ్యారు. అనంతరం యూరాలజీ ఆర్‌ఐసీయు, నెఫ్రాలజీ విభాగ వార్డుల్లో ట్రీట్మెంట్ పొందుతున్న కర్నాటక, తమిళనాడులకు చెందిన కిడ్నీ డోనర్స్ నస్రీన్‌బేగం (35), ఫిర్ధోస్‌బేగం (40), రిసీవర్స్ రాజశేఖర్ (68), క్రిపాలత (45)లతో విచారణ చేపట్టారు. మొదటిగా మిమ్ములను ఎవరు సంప్రదించారు, ఆయా రాష్ట్రాల నుంచి ఎలా ఇక్కడకు వచ్చారు, ఎన్ని డబ్బులు ఇచ్చారు, సర్జరీలు ఎప్పుడు చేశారు, ఆస్పత్రి నిర్వాహకులతో పాటు ఎవరెవరి పాత్ర ఉంది, మీ ఆరోగ్యం ఎలా ఉంది.. తదితర అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించి, కిడ్నీ డోనర్స్, రివసీర్ల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. గాంధీలో ట్రీట్మెంట్ తర్వాత నలుగురు బాధితులు క్రమంగా కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. సుమారు మూడు గంటల పాటు విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. నివేదికను సీల్ట్ కవర్‌లో ప్రభుత్వానికి అందచేస్తామని తెలిపారు.