గ్రామ సభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదు, కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమే
గ్రామ సభల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసిన డిప్యూటీ సి.ఎం., మంత్రులు, సి.ఎస్
జగిత్యాల 21 (ప్రజా మంటలు )
పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలని, పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
మంగళవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి లతో కలిసి గ్రామ సభల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా *డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ,* 4 నూతన పథకాల అమలు కోసం నేడు గ్రామ సభలు ప్రారంభించి రాష్ట్రంలో మొదటి రోజు 4938 గ్రామ/ వార్డు సభలు నిర్వహించడం జరిగిందని అన్నారు. గ్రామ సభలలో ప్రదర్శించిన పథకాల అర్హుల ప్రాథమిక జాబితాలో అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా స్వీకరించి విచారణ చేపట్టాలని, అనర్హులుగా తేలితే జాబితా నుంచి తొలగించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
అర్హులకు తప్పనిసరిగా పథకాలు అందిస్తామని ప్రజలకు స్పష్టంగా అధికారులు తెలుపాలని ఉప ముఖ్యమంత్రి అన్నారు.
*రాష్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,* మన రాష్ట్రంలో 91 లక్షల తెల్ల రేషన్ కార్డులు 2 కోట్ల 80 లక్షల లబ్ధిదారులతో ఉన్నాయని, గత 10 సంవత్సరాలలో నూతన రేషన్ కార్డులు జారీ చేయని కారణంగా ప్రస్తుతం ప్రజల నుంచి అధికంగా డిమాండ్ ఉందని అన్నారు.
ప్రజా పాలన, మీసేవ కేంద్రాలలో రేషన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని, ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమానికి రేషన్ కార్డు లింక్ ఉండటంతో అర్హులందరికీ రేషన్ కార్డు జారి అయ్యేలా చూడాలని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రతి దరఖాస్తు ను విచారించి అర్హత ఉంటే రేషన్ కార్డు జారీ చేయాలని మంత్రి ఉత్తం తెలిపారు.
* మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,* ఇందిరమ్మ ఇండ్ల సర్వే అనంతరం ఇండ్లు లేని దాదాపు 30 లక్షలమంది అర్హులను గుర్తించి వివరాలు జిల్లాలకు పంపామని, వీరిలో ఇంటి స్థలం ఉన్నవారిలో ప్రాధాన్యత క్రమం లో నిరుపేదలను మొదటి విడత కింద తీసుకొని ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.
జగిత్యాల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్లు ,బి ఎస్ లత ,గౌతమ్ రెడ్డి ఆర్డీవో పులి మధు సుదన్ గౌడ్ ,డి.ఆర్. డి. ఓ. రఘు వరుణ్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు