రైతు భరోసా రూ.15 వేలు ఇవ్వాల్సిందే-టి ఆర్ ఆర్ ఎస్ నాయకులు
రైతు భరోసా రూ.15 వేలు ఇవ్వాల్సిందే-టి ఆర్ ఆర్ ఎస్ నాయకులు
ఎల్కతుర్తి జనవరి 12 (ప్రజా మంటలు):
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ రైతు రక్షణ సమితి( టీ ఆర్ ఆర్ ఎస్)నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు ఆధ్వర్యంలో నాయకులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సర్కారు రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసాను తప్పనిసరిగా 15000 ఇవ్వాలని కోరారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు భరోసాలో కోతలు విధించడం సరికాదని పేర్కొన్నారు. రూ. రెండు లక్షల వరకు రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో చేయాలని కోరారు.
సన్న వడ్లకు ప్రభుత్వం చెల్లించే బోనస్ సైతం రైతులకు పూర్తిస్థాయిలో అందడం లేదని, ప్రభుత్వం ఈ విషయమై దృష్టి సారించాలని కోరారు. రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని భావించాలంటే తప్పనిసరిగా రైతు భరోసాను రూ.15 వేలు ఎకరానికి చెల్లించాల్సిందేనని వెల్లడించారు. గత ప్రభుత్వం కరోనా కష్ట కాలంలో సైతం రైతుబంధును క్రమం తప్పకుండా రైతన్నకి అందజేసిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం అన్నదాతకు అండగా నిలవాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో రైతు రక్షణ సమితి ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు కొప్పు తిరుపతి, ప్రధాన కార్యదర్శి కోదాటి రామారావు, కమలాపూర్ మండల అధ్యక్షుడు నూనె రమేష్, నాయకులు హింగె రవీందర్, స్వర్గం అనిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.