ధర్మపురిలో కన్నుల పండువగా కార్తీక పౌర్ణమి వేడుకలు
కన్నుల పండువగా కార్తీక పౌర్ణమి వేడుకలు
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి నవంబర్ 15:
ప్రాచీన పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి పర్వదిన వేడుకలు శుక్ర
వారం వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. జాతర సమయాన్ని మరపించి, భక్తులు, యాత్రికులు, స్థానికులు ఉదయాత్ పూర్వం నుండే పవిత్ర గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించి, దైవ దర్శనార్ధం దేవస్థానంలోని ప్రధానాలయాల ముందు నిలు చున్నారు. వేకువ జామునే ఆలయాల అర్చకులు వేద మంత్రాలతో, మంగళ పద్యాలతో పవిత్ర జలాలతో, స్థానిక ఇలవేలుపులను అభిషేకించారు. ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల, యమ ధర్మరాజు, ప్రసన్నాంజనేయ, శ్రీరామలింగేశ్వరా లయాలలో ఉదయం నుండి ప్రత్యేక ఆర్చనలు, పూజలు, అభిషేకాలు, కంకుమార్చనలు, నిత్య కళ్యాణ ఆది కార్యక్రమాలను నిర్వహించగా, భక్తజనం ప్రత్యేక పూజాదికాలు చేయించి, మొక్కులు తీర్చు కున్నారు. శ్రీవేణుగోపాల, శ్రీవేంకటేశ్వర ఆలయాల మధ్యగల ఉసిరిక వృక్షం వద్ద కార్తీక దామోదరునికి ఈ సందర్భంగా ప్రత్యేక పూజ లొనరించారు. క్షేత్ర పౌరోహితులు పాలెపు బద్రీనాథ్ కు, అర్చకులకు ఉసిరికల, దీపాలను దానం చేసు కున్నారు. పవిత్ర గోదావరి నదీ జలాలలో దొప్పలతో వెలిగించిన కార్తీక దీపాలను వదిలి పెట్టారు. శ్రీరామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక చండి ప్రదక్షిణాలను ఆచరించారు.
కార్తీక మాసం అందునా పౌర్ణమి అత్యంత ప్రధానమూ, పరమ పవిత్రమూ అని ధర్మపురి దేవస్థాన ఆస్థాన వేద పండితులు బొజ్జ రమేశ శర్మ అన్నారు. రమేశ శర్మ దేవస్థానంలో మాట్లాడుతూ, మానవులకు కావలసిన ఆహార ధాన్యాలలో, పండ్లలో చంద్రుడు కురిపించు వెన్నెల ద్వారా అమృతాన్ని నింపడం జరుగు తుందన్నారు. ఈరోజు చంద్రుడు భూమికి అతి దగ్గరగా లంబముగా నుండు నని, దగ్గరకు వచ్చే ఆలౌకిక ఘట్టాన్ని దీపాలతో స్వాగతించడం సత్సాంప్రదాయ మన్నారు.
సముద్ర మధనంలో చంద్రుడు, లక్ష్మీదేవిలు కార్తీక పౌర్ణమి రోజునే ఉద్భ వించారని, కనుక ఇది గొప్ప యోగంగా భావించ బడుతున్న దన్నారు. ధర్మపురి క్షేత్రంలోని బ్రహ్మదేవునిచే నిర్మితమైన పుష్కరికి (కోసరు) లో ఈరోజున పంచనహస్ర దీపాల జ్యోతులతో చంద్రునికి ఆహ్వానం పలికే వినూత్న కార్యక్రమం భక్తి ముక్తి ప్రదాయకమన్నారు.
అల వైకుంఠ పురియై అలరారిన ధర్మపురి
దక్షిణ కాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రాలలో నొకటిగా, గంభీర గౌతమీ తటమున వెలసి, వరదాయిగా, భక్తి ముక్తి ప్రదాయినిగా, నిత్య భక్తజన సందడితో అలరారుతున్న ధర్మపురి క్షేత్రం, కార్తీక మాసోత్సవ వేడుకలలో అత్యంత ముఖ్యమైన పౌర్ణమి సందర్భంగా శుక్ర వారం అపర వైకుంఠపురియై అలరారింది.