ఘోరం.... తొమ్మిది రోజులుగా ఇంట్లోనే తల్లి శవం..
ఘోరం.... తొమ్మిది రోజులుగా ఇంట్లోనే తల్లి శవం..
* డిప్రెషన్ లోకి ఇద్దరు కూతుళ్ళు..సూసైడ్ కు అటెంప్ట్..
*ఎవరు తోడు లేక.. డబ్బులు లేక దహన సంస్కారాలు చేయలేదని వెల్లడి...
సికింద్రాబాద్ జనవరి 31:
వారాసిగూడ లో హృదయ విదారక సంఘటన వెలుగు చూసింది
చేతిలో డబ్బులు లేక, వెంట తోడు ఎవరు లేకపోవడంతో ఏకంగా తొమ్మిది రోజులుగా అనారోగ్యంతో చనిపోయిన తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచుకున్న కూతుళ్ళ ధీనగాథ ఇది..
వారాసిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...వారాసిగూడ బౌద్దనగర్ లోని మీనా బేకరి ఎదురు గల్లీలోని బిల్డింగ్ లోని మూడవ ఫ్లోర్ లో రెండేళ్ళ నుంచి సీమల శ్రీలలిత(45) కుటుంబం అద్దెకు ఉంటున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్యోగం చేసే భర్త రాజు ఐదేండ్ల క్రితం భార్య శ్రీలలిత, ఇద్దరు కూతుర్లను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉండగా, ఇద్దరు టెన్త్ క్లాస్ వరకే చదివి, ఆర్థిక పరిస్థితుల నేపద్యంలో చదువును మద్యలో ఆపేశారు. పెద్ద కూతురు రవళిక(24) ఓ బట్టల షాపులో పనిచేస్తుండగా, చిన్న కూతురు అశ్విత(22) ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలో కేటరింగ్ విభాగంలో ప్రైవేట్ జాబ్ చేస్తోంది.
తల్లి శ్రీలలిత గత కొంత కాలంగా బ్రీతింగ్ సమస్యతో బాధపడుతోంది. ఈ నేపద్యంలో ఆమె అనారోగ్యంతో ఈనెల 22 రాత్రి చనిపోయింది. 23 తేదిన కూతుళ్ళు నిద్రలేచి చూడగా, తల్లి చనిపోయి కనిపించింది. దాంతో షాక్ కు గురైన ఇద్దరు కూతుర్లు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు.
తల్లి దహన సంస్కారాలకు చేతిలో డబ్బులు లేకపోవడం, తోడుగా పెద్ద దిక్కు ఎవరు లేకపోవడంతో తల్లి శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. తీవ్రమైన మనోవేదనతో రవళిక, అశ్విత కత్తితో చేయి కోసుకొని సూసైడ్ చేసుకుందామని అనుకొని, ధైర్యం చాలక భయపడి ఆ ప్రయత్నం మానేశారు.
తొమ్మిది రోజులుగా తల్లి శవాన్ని ఓగదిలో ఉంచి, తామిద్దరం మరో గదిలో ఉన్నట్లు కుమార్తెలు తెలిపారు. ఇంట్లో ఉన్న బ్రెడ్, కాసింత్ ఆహారం తింటూ కాలం గడిపారు. వీరు మూడవ ఫ్లోర్ లో ఉండటంతో శవం దుర్వాసన కింది వరకు రాకపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.
తొమ్మిది రోజులుగా ఇంట్లో తల్లి శవాన్ని పెట్టుకొని ఉండగా, శుక్రవారం కూతుళ్ళు తల్లి దహన సంస్కారాలకు స్థానికుల సాయం కోసం ప్రయత్నించారు. సీతాఫల్మండి లోని సికింద్రాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళి అడిగితే , వారు సాయం చేస్తారని కొందరు చెప్పడంతో వీరు అక్కడికి వెళ్ళారు.
వెంటనే క్యాంప్ ఆఫీస్ సిబ్బంది వారాసిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, సీఐ సైదులు, అడ్మిన్ ఎస్ఐ సుధాకర్ లు ఘటన స్థలానికి చేరుకొని, శ్రీలలిత డెడ్బాడిని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. క్లూస్ టీమ్ ఇంట్లో పరిశీలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.