రైతుల పక్షపాతి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
రైతుల పక్షపాతి రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జనవరి 17:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోని తమ రాష్ట్ర ప్రభుత్వం పక్కా రైతుల పక్షపాతి అని రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి
లక్ష్మణ్ కుమార్ అన్నారు. తమ అభ్యర్థన పై శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుండి గోదావరి లోనికి నీటిని విడుదల చేసిన సందర్భంగా గురువారం ధర్మపురి మండలంలోని ధమ్మన్నపేట గ్రామం సమీపాన గోదావరి నది వద్దకు మండల నాయకులు, రైతులతో కలసి వెళ్లి, నీటి విడుదల పరిస్థితిని
పరిశీలించారు. మొదటగా గోదావరి నదీమ తల్లికి పూజలు నిర్వహించి, నీటిని విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చిత్ర పటాలకు మండల నాయకులతో కలసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ధమ్మన్న పేట లిఫ్ట్ ను ప్రారంభించి నీటిని విడుదల చేసారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ...
గోదావరిలో నీళ్ళు లేక సాగుకు ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని, రైతులు తన దృష్టికి తీసుకువచ్చి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని, వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించి ఒక టీఎంసీ నీటిని గోదావరిలో విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశా మన్నారు.
ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్న పర్వదినం అయినప్పటికీ ప్రత్యేకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో సమావేశమై నీటి విడుదల గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగిందనీ, అధికారులతో చర్చ సందర్భంగా... నిబంధనలకు అనుగుణంగా ఏ ప్రాంతానికి ఎంత నీళ్ళ వాట కేటాయింపు పైన పోచంపాడు వద్ద నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, ప్రస్తుతం నీటి విడుదల కొంత కష్టమని, అదే విధంగా ఒక టీఎంసీ నీటిని విడుదల చేసినప్పటికి గోదావరి లిఫ్ట్ల వరకు నీరు అందదని ఇరిగేషన్ అధికారులు చెప్పడం జరిగిందని వివరించారు. అయితే,
జీవన్ రెడ్డి చొరవ తీసుకుని,
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో, ఇరిగేషన్ అధికారులతో ఏ పద్ధతిలో నీటిని విడుదల చేస్తే జగిత్యాల, ధర్మపురి ప్రాంతాలకు నీరు అందుతుందో తన అనుభవం ద్వారా వివరించడం జరిగిందని తెలిపారు.
దానికి మంత్రిగారు ఒప్పుకొని జగ్గసాగర్ నుండి నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని, ఈ నేపథ్యంలో అధికారులు నీటిని విడుదల చేయడం జరిగిందని, ఈ సంధర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.