పట్టభద్రుల ఎమ్మెల్సీగా నా ప్రవేశం రాజకీయ పునరావాసం కోసం కాదు - పునర్నిర్మాణమే నా లక్ష్యం
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు) :
పట్టభద్రుల ఎమ్మెల్సీగా శాసనమండలిలో నా ప్రవేశం పునరావాసం కోసం కాదు పునర్నిర్మాణమే నా లక్ష్యంగా పనిచేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ అన్నారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్ లో హరికృష్ణ విద్యార్థి బృందం, మిత్ర బృందం ,శ్రేయోభిలాషులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
నిరుద్యోగ పట్టభద్రుల కోసమే తాను పదవి వదులుకున్నానని పేర్కొన్నారు. 2008 ఉమ్మడి రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ పరీక్షలో ప్రతిభ చూపి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రభుత్వ అధ్యాపక ఉద్యోగాన్ని పొందానని సిరిసిల్ల జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు డిగ్రీ లెక్చరర్ గా పదోన్నతి పొందానని తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇటీవలే తన పదవిని వదులుకొని పట్టభద్రుల నిరుద్యోగుల కోసం శాసన మండలికి పోటీచేస్తున్నాని అన్నారు.
సమస్యలు చెప్పుకోవడం కాదు మనమే తీర్చుకుందాం అన్న నినాదంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎంతోమంది నిరుద్యోగ అభ్యర్థులకు గైడెన్స్, మరియు కౌన్సిలింగ్ తో విన్నర్స్ పబ్లికేషన్స్ సలహాదారునిగా ఉద్యోగం సాధించడానికి మార్గ దర్శనం చేసి ఎందరో నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దానని ఈ విధంగా తన జీవన గమనంలో ఎందరో నిరుద్యోగ యువకులతో స్థరీకరణం జరిగిందని నిరుద్యోగ పట్ట భద్రుల సమస్యలు తను దగ్గర నుండి చూశానని తెలిపారు.
సామాజిక సేవకునిగా
సమాజానికి తాను ఏమి చేయాలనే ముఖ్యమన్న భావనతో సామాజిక స్పృహతో తన ఉద్యోగానికి వచ్చే జీతం లో 30% నిరుద్యోగులకు పుస్తకాలు ముద్రించి పంపిణీ చేయడంలో వినియోగించానని ఇది తన సామాజిక బాధ్యతగా భావించినట్లు తెలిపారు.
ఎమ్మెల్సీగా పోటీచేసే అభ్యర్థికి పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. తన జీవన గమనంలో ఎందరో నిరుద్యోగుల సమస్యలను గమనించానని ఈ నేపథ్యంలో తాను ఒక సామాజిక కార్యకర్తగా సేవలు అందించాలనే దృక్పథంతో గ్రంథాలయాల్లో ఎన్నో విలువైన పుస్తకాలను నిరుద్యోగుల కోసం ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రసన్న హరికృష్ణ గెలుపు భావితరాల రాజకీయాలకు బాటలు వేసే వ్యక్తి గెలుపుగా భావించి తనకు మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు.
శాసనమండలి (ఎగువ సభ) అవసరం ఏమిటి ???
ఎగువ సభ అయిన శాసనమండలి అవసరాన్ని సోదాహరణగా తెలియజేస్తూ జార్జి వాషింగ్టన్ ను థామస్ జఫర్సన్ అడిగిన ప్రశ్నకు వేడుకప్పు టీ తాగడానికి సాసర్ ఎంత అవసరమో ఉద్వేగంలో చేసిన చట్టాలను పునర్ ఆలోచించడానికి శాసనమండలి (ఎగువసభ) అంత అవసరమని చెప్పిన ఉదాహరణ పట్టభద్రులను ఆకట్టుకుంది. అదేవిధంగా నాయకునికి ఉండాల్సిన మొదటి లక్షణము, లక్ష్యము భవిష్యత్తుకు ఆశ కలిగించేలా ఉండాలని నెపోలియన్ బోనాపార్టీ నినాదాన్ని ఉటంకించారు.
మారుతున్న సమాజ పోకడలకు అనుగుణంగా యువత ఆలోచనలు ఉండాలన్నారు. ప్రస్తుతం తాను ఏ పార్టీకి అనుబంధం కాదని ఒకవేళ ఏదైనా అవకాశం వస్తే తనను కేవలం తమ కుటుంబ సభ్యునిగా ప్రసన్న హరికృష్ణ గా భావించాలి తప్ప తను ఏదో ఒక పార్టీ సభ్యునిగా చూడరాదని అన్నారు.
*శాసనమండలి సభ్యునిగా తన మొదటి ప్రాధాన్యత* ప్రైవేటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ,హెల్త్ కార్డులు ఉండేలా చూడడం అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం కొనసాగేలా శాసనమండలిలో చర్చిస్తానని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యావేత్తలు మాట్లాడుతూ.... ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగుల పట్టభద్రుల పట్ల ముందుచూపు ఉన్న వ్యక్తిగా ఆయన గతంలో, ప్రస్తుతం నిరుద్యోగ యువతకు చేస్తున్న ఉచిత సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ బోర్డు అధికారి కె.వెంకటేశ్వర్లు ,చైతన్య జూనియర్ కళాశాల కరస్పాండెంట్ ముసిపట్ల రాజేందర్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ దాసరి రాజేందర్ ,బ్రహ్మాండ భేరి నరేష్, భూమి రమణ, డాక్టర్ పరమేష్, ప్రభుత్వ అధ్యాపకులు అనంత రామకృష్ణ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల నాయకులు వేణుగోపాల్ పలు ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, కళాశాలల అధ్యాపక బృందం, నిరుద్యోగ పట్టభద్రులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పట్టభద్రులు, మహిళా పట్టభద్రులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.