ప్రభుత్వ దవఖానల్లో మందుల కొరతను తీర్చాలి.
ప్రభుత్వ దవఖానల్లో మందుల కొరతను తీర్చాలి
సికింద్రాబాద్ నవంబర్ 23 (ప్రజామంటలు):
ప్రభుత్వ దవఖానల్లో నిరుపేద రోగులకు అన్ని రకాల మందులను పూర్తిస్థాయిలో అందించాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (పీవైఎల్), ప్రగతిశీల మహిళ సంఘం (పీఓడబ్ల్యూ) ప్రతినిధులు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ గాంధీ దవఖాన ఆవరణలో శనివారం సర్వే నిర్వహించి, పేషంట్ల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించినట్లు తెలిపారు. గాంధీ దవఖానలో కొన్ని మందులు మాత్రమే ఇస్తున్నారని, మిగిలినవి ప్రైవేటు మెడికల్ షాపులో కొనుగోలు చేస్తున్నామని పలువురు రోగులు తమ దృష్టికి తెచ్చారని, మందుల కొరతపై వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ర్టంలోనే పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన గాంధీలోనే పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. మందుల కొరతపై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సర్వే నిర్వహించి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్యమంత్రి, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిరుపేద రోగులకు అన్నిరకాల మందులను పూర్తి స్థాయిలో ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పీవైఎల్, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ ప్రదీప్, స్వరూప, సంఘ ప్రతినిధులు బీఎస్ కృష్ణ, లక్ష్మీబాయి,శ్రీనివాస్, దేవరాజ్లు పాల్గొన్నారు.
–––––––