ప్రజావాణితో పదేళ్ల బాలుడికి పునర్జన్మ కాలేయ మార్పిడికి రూ. 10.50 లక్షలు మంజూరు
ప్రజావాణితో పదేళ్ల బాలుడికి పునర్జన్మ
కాలేయ మార్పిడికి రూ. 10.50 లక్షలు మంజూరు
దినసరి కూలీ కుటుంబానికి అండగా నిలిచిన ప్రజావాణి
హైదరాబాద్ జనవరి 28:
ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా పదేళ్ల బాలుడు చింతకింది విశాల్ కు పునర్జన్మ లభించింది.మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం జరిగిన సీఎం ప్రజావాణిలో ఆ బాలుడు విశాల్ తల్లిదండ్రులు శంకర్, సరితలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున ఉచితంగా కాలేయ మార్పిడి చేసే ఉత్తర్వులను ఇన్చార్జి డాక్టర్ జీ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య అందజేశారు.
ఖమ్మం జిల్లా పోలేపల్లి గ్రామానికి చెందిన దినసరి కూలి చేసుకునే శంకర్, సరిత దంపతులు పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం హైదరాబాద్‌లోని బోరబండలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు.
వాళ్ల బాలుడు విశాల్ ( 10 ) అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆ పిల్లాడి తల్లిదండ్రులు చికిత్స చేయించారు. అయితే కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్టుగా ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. కాలేయ మార్పిడి చేయించడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో విషయాన్ని ఆ బాలుడి తల్లిదండ్రులు శంకర్, సరిత ప్రజావాణిలో తమ దీనగాథను ఇన్చార్జి డాక్టర్ జి చిన్నారెడ్డి స్టేట్ మోడల్ అధికారి దివ్యలకు విన్నవించారు.
వారి సూచనల మేరకు ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించి బాలుడు విశాల్ కు కాలేయ మార్పిడి కోసం పది లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేస్తూ.. ఉచితంగా కాలేయ మార్పిడికి ఏర్పాట్లు చేశారు.
నిమ్స్ లోని జీవన్‌దాన్ ట్రస్టులో బాలుడు విశాల్ పేరు నమోదు చేయించారు. అతి త్వరలో ఆ బాలుడికి కాలేయ మార్పిడి చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా తమ బాలుడికి పునర్జన్మ లభించిందని విశాల్ తల్లిదండ్రులు శంకర్ సరిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ బాలుడు విశాల్ కు పునర్జన్మ ప్రసాదించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ప్రజావాణి ఇన్చార్జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ లకు శంకర్, సరిత ధన్యవాదాలు తెలిపారు.