అభివృద్ది పనులతో సమస్యల పరిష్కారం * ఎమ్మెల్యే తలసాని
అభివృద్ది పనులతో సమస్యల పరిష్కారం
* ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్, జనవరి 28 ( ప్రజామంటలు):
అభివృద్ధి పనులతోనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బన్సీలాల్ పేట డివిజన్ లోని మేకలమండి లో 19.25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ రీమోడలింగ్ పనులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఎంతో అభివృద్ధి చేసి దీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చేశామని చెప్పారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం ద్యేయంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అవసరమైన ప్రాంతాలలో నూతన వాటర్, సీవరేజ్ పైప్ లైన్ ల ను ఏర్పాటు చేయడమే కాకుండా అనేక ప్రాంతాల్లో పాత పైప్ లైన్ లను ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకొని పైప్ లైన్ ల సామర్ధ్యం పెంచడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత,జీహెచ్ఎమ్ సీ డీఈ ఆంజనేయులు, వాటర్ వర్క్స్ డీజీఎమ్ ఆశిష్, శానిటేషన్ డీఈ వెంకటేష్, ఎలెక్ట్రికల్ ఏఈ శ్రీనివాస్ రెడ్డి, స్ట్రీట్ లైట్ ఏఈ అనూష, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్,వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, లక్ష్మీపతి, రమణ, శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుల నిరసన:
గత కొన్నేండ్లుగా నెలకొన్న మేకలమండి డ్రైనేజీ సమస్యను పరిష్కరించని స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు మంజూరైన పనులను తాము చేసినట్లుగా చెప్పుకోవడం చూస్తే సొమ్ము ఒకరిది...సోకు ఒకరిది...అన్నట్లుగా ఉందని కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి విమర్శించారు. ఎమ్మెల్యే పర్యటన సందర్బంగా కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రధర్శన నిర్వహించారు. నినాదాలు చేశారు. కొబ్బరికాయ కొట్టే ముహుర్తం కోసం ఎమ్మెల్యే వచ్చే వరకు పనులు ప్రారంభించకపోవడం ఏమిటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఆందోళన లో నాయకులు జీఎల్ రమేశ్, సాయి సందీప్, దీపిక, అబ్దుల్ కలీమ్, మధుర వీరన్, గజానంద్, కృష్ణ పాల్గొన్నారు.