రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి  -మార్కెట్ పాలక వర్గానికి జీవన్ రెడ్డి సూచన

On
రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి  -మార్కెట్ పాలక వర్గానికి జీవన్ రెడ్డి సూచన

రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
 -మార్కెట్ పాలక వర్గానికి జీవన్ రెడ్డి సూచన
 (రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి అక్టోబర్ 14:
 రైతులకు సంబంధించిన ప్రతి సమస్య పరిష్కారానికి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం నిరంతర కృషి చేయాలని కాంగ్రెస్ వరిష్ఠ నేత, ఎమ్మెల్సీ తాడిపర్తి జీవన్ రెడ్డి సూచించారు. ధర్మపురి మార్కెట్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోమవారం ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి ప్రసంగిస్తూ... మార్కెట్ కమిటీ కేవలం ధాన్యం కొనుగోలు గురించే కాక, సాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, రైతు బంధు, బీమా తదితర అంశాలపై దృష్టి నిలిపి, అవసరమున్న వారికి సాయం అందించాలన్నారు. ధాన్యంలో తప్ప తాలు తేమ సమస్యలు రాకుండా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లాగ కొనుగోళ్లు జరగాలని ఆకాంక్షించారు. దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా రుణమాఫీ అమలు చేశారా అంటూ, 2లక్షల ఋణ మాఫీ ఏక మొత్తంలో చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. నవంబరు 7లోగా 2లక్షల లోపు ఋణాల మాఫీ పూర్తిగా చేయడానికి కృషి చేస్తామన్నారు. ప్రజల పక్షాన పోరాటాలకు అలవాటు పడిన లక్ష్మణ్ కుమార్ ప్రస్తుతం తన కన్నా ఎక్కువ సమయం ప్రజల మధ్యన గడపడాన్ని అభినందించారు. 

ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తమ సుదీర్ఘ ప్రసంగంలో....కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు రుణాలను మాఫీ చేసి చూపించామని, జగిత్యాల జిల్లాకు సంబంధించి 64వేల రైతులకు 80 శాతం వరకు రుణమాఫీ పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 20 శాతం రైతులకు రుణాలకు మాఫీ చేసి తీరుతామని, ఈ ప్రాంత ఇరిగేషన్ విషయంలో కూడా ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి గారిని కలిసి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. త్వరలోనే బడ్జెట్ లో ప్రతిపాదించిన విధంగా 
పత్తిపాక రిజర్వాయర్ ను పూర్తి చేసి రైతాంగానికి నీటిని అందిస్తామని, లిఫ్ట్ లకు కూడా మరమ్మతులు పూర్తి చేయించి తిరిగి వాడుకలోకి తీసుకురావడం జరిగిందని, రోళ్ళ వాగు ప్రాజేక్ట్ కూడా అంచనా వ్యయం పెంచి నప్పటికీ దాన్ని గత ప్రభుత్వంలో పూర్తి చేయలేకపోయారని ,దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఐ టి ఐ, డిగ్రీ కళాశాల, సమగ్ర ఇంటర్ కళాశాల, బస్ డిపో ఏర్పాట్లకు కృషి చేస్తామన్నారు. తన పేరును పి సి సి అధ్యక్ష స్థానానికి పరిశీలనకు అధిష్టానానికి పంపిన సీఎం రేవంత్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపి, తనకు పదవుల కన్నా ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని సీఎంకు విన్నవించా మన్నారు. 
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మార్కెట్ పాలక వర్గం పైన ఉందన్నారు.

పీసీసీ సభ్యులు దినేష్ సంగన భట్ల నిర్వహించిన కార్యక్రమంలో...
నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్, వైస్ చైర్మన్ సంగ నర్సింహులు,   డైరెక్టర్ల చేత జిల్లా మార్కెట్ అధికారి ప్రకాశ్ ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. అనంతరం నూతనంగా నియామకమైన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ గారు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, వివిధ మార్కెట్ చైర్మన్లు, మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, నూతన పాలక వర్గాన్ని అభినందించి సన్మానించారు.  కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags