శరన్నవరాత్రి ఉత్సవ వేడుకలలో కాళరాత్రి దేవిగా దర్శనం

On
శరన్నవరాత్రి ఉత్సవ వేడుకలలో కాళరాత్రి దేవిగా దర్శనం

 

(రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి అక్టోబర్ 09 (ప్రజా మంటలు) :

ధర్మపురి క్షేత్రస్థ శ్రీరామ లింగేశ్వర ఆలయంలో నిర్వ హిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవ వేడుకలలో భాగంగా బుధ వారం శ్రీశారదామాత కాళరాత్రి మాత రూపధారిణియై అవతరించి, ప్రత్యేక పూజలందుకున్నది. దుర్గామాత సప్తమ స్వరూపం కాళరాత్రి దేవిగా ప్రసిద్ధి గాంచింది. ఆమె శరీరం ఘనాంధకార సమంగా కాలవర్ణంగా ఉంటుంది. శిరోజాలు చెల్లా చెదురై ఉంటాయి. గళ సీమలో విద్యుత్ సమంగా భాసిల్లే హారం, గోళాకార బ్రహ్మాండ సమ త్రినేత్రాలు, నాసిక నుండి భయంకర ప్రజ్వలిత జ్వాలలు బహిర్గతమయ్యే రూపం ఆమెది. గార్ధభ వాహనయై, పైకి లేచి ఉన్న దక్షిణ హస్తం వరద హస్తం ద్వారా వరాలను ప్రసాదిస్తుంది.

దక్షిణంగా క్రింది భాగంలోని చేయి అభయ ముద్రలో, వామభాగంలో పైకి లేచిన చేయిలో లోహకంటకం, క్రింది హస్తంలో ఖడ్గమూ ఉంటాయి. కాళరాత్రి దేవి రూపం చూడ భయంక రంగా ఉన్నా, సర్వదా అమె శుభ ఫలాలనే అందిస్తుంది. అందుకే ఆమెను శుభంకరి అంటారు. నవరాత్రులలో ఏడవ దినానికి ప్రత్యేకత ఉంది. ఏడవ దినాన సాధకుని మనస్సు, సహస్రాకార చక్రంలో (మిగతా లయమై ఉండి, సాధకునకై బ్రహ్మాండం లోని సిద్ధి ద్వారాలన్నీ తెరుచు కుంటాయి. అతని మనస్సు కాళరాత్రి దేవి స్వరూపంలో లయమై ఉంటుంది. తద్వారా పాప, విఘ్న సర్వస్వం నశిస్తాయి. కాళరాత్రి దేవి దుష్టులను నాశనం చేస్తుంది. దైత్య దానవ రాక్షస భూత ప్రేతాదులు జనని నామ స్మరణ మాత్రం చేతనే పారిపోతాయి. ఈమె ఉపాసన వల్ల అగ్ని, జంతు, శతృ, రాత్రి భయాలుండవు. యమ, నిమయ, సంయమాలను పాటించి ఆమెను ఉపాసించాలి.

9a

కాళరాత్రి దేవికి ప్రత్యేక పూజలు

 బుధ వారం రామలింగేశ్వరాంతర్గత శారదా దేవి మందిరాన దేవ స్థానం ఇఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్,  కిరణ్, సీ. అ. శ్రీనివాస్ పర్యవేక్షణలో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ్ శర్మ, ముత్యాల శర్మ, పాలెపు ప్రవీణ్ శర్మ నేతృత్వంలో, పాలెపు సందీప్ శర్మ, నంబి అరుణ్, దేవళ్ళ సాయి, అర్చకులు దేవళ్ళ విశ్వనాథ శర్మ తదితరులు కలశ, గణపతి పూజలు, చతుష్షష్ఠి పూజలు, సప్త శతి పారాయణాలు, లలితా సహస్రనామ పారాయణాలు, లలితా అష్టోత్తర కుంకుమార్చనాది ప్రత్యేక అర్చనలు చేశారు. ఈ కార్య క్రమంలో అధిక సంఖ్యాకులైన భక్తులు పాల్గొన్నారు. అలాగే శ్రీనర్మదేశ్వర మందిరంలో ప్రతిష్ఠిత దుర్గామాతకు వేదవిదులైన చంద్రమౌళి శర్మ ఆధ్వర్యంలో, టిటిడిలో కాసర్ల వంశీ కృష్ణ, బాలకృష్ణ, వంశీకృష్ణ ఆధ్వర్యంలో లలితా సహస్ర నామార్చనలు, చండీ పారాయణం, చతుషష్టి పూజలు, సామూహిక రుద్రాభిషేకం నిర్వహించారు. దుర్గ గాయత్రి శివాలయంలో సీతారామశర్మ, కన్యకా పరమేశ్వరి ఆలయంలో  శరన్నవరాత్రి ప్రత్యేక పూజాదులు నిర్వహించారు.

Tags