ఆయిల్ ఫామ్ తోటల సాగుపై రైతుల క్షేత్రస్థాయి విజ్ఞాన యాత్ర

కే ఎన్ బయోసైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సందర్శన

On
ఆయిల్ ఫామ్ తోటల సాగుపై రైతుల క్షేత్రస్థాయి విజ్ఞాన యాత్ర

అంతర్ పంటలపై అవగాహన కల్పించిన జిల్లా అధికారి ఆర్ శ్రీనివాసరావు

భీమదేవరపల్లి జూలై 01 (ప్రజామంటలు) :

 

కే ఎన్ బయో సైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఫామ్ ఆయిల్ సాగు రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ జిల్లాల ఉద్యానవన శాఖ అధికారి ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ, పామ్ ఆయిల్ సాగును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. హనుమకొండ డివిజన్ లోని వివిధ మండలాల రైతులతో కలిసి ఆయిల్ ఫామ్ సాగును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గంగారం, కాకర్లపల్లి గ్రామాలలోని ఆయిల్ ఫామ్ తోటలను సందర్శించారు. ఆయిల్ ఫామ్ తోటలో అంతర్ పంటల సాగుకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై వివరించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల దిశగా ఆలోచన చేయాలని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు లాభాలపై, రైతులకు నమ్మకం కలిగించేందుకు ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులతో నేరుగా మాట్లాడించేందుకు రైతులను క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకు వెళ్ళామని అన్నారు. అనంతరం అప్పారావుపేట లోని ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని రైతులతో కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి బి మానస, కే ఎన్ బయో సైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి కే. రంజిత్, ఫీల్డ్ ఆఫీసర్స్, రైతులు పాల్గొన్నారు.

Tags