కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు

సిండికేట్‌కు పొలిటికల్​ అండ

On
కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు

గంజాయి తర్వాత ఇదే

కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు
-సిండికేట్‌కు పొలిటికల్​ అండ

గంజాయి తర్వాత ఇదే

హైదరాబాద్ జనవరి 24:

 కల్తీ కల్లు తయారీ కోసం డేంజరస్ డ్రగ్​ అయిన అల్ఫాజోలం వాడుతున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో(ఎన్​ఏబీ) గుర్తించింది. అల్ఫాజోలం కలిపిన కల్లు వల్ల వేలాది మంది క్రమంగా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్​ఏబీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. అల్ఫాజోలం రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే విషయాలపై ఫోకస్​ పెట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ ​అడ్మినిస్ట్రేషన్, ఎక్సయిజ్ ​శాఖలతో సమన్వయాన్ని ఏర్పరచుకుంటున్నారు.

గంజాయి తర్వాత ఇదే..

రాష్ట్రంలో గంజాయి తర్వాత అల్ఫాజోలం వాడకమే అధికమని అధికారులు చెబుతున్నారు. గడచిన రెండేళ్లలో 293 కిలోల అల్ఫాజోలంను అధికారులు స్వాధీనం చేసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వేర్వేరు మార్గాల్లో రాష్ట్రానికి చేరుతున్న ఆల్ఫాజోలెంను ప్రధానంగా కల్తీ కల్లు తయారీలో ఉపయోగిస్తున్నారు. సాధారణంగా దీనిని నిద్రలేమి, యాంగ్జయిటీ సమస్యలతో బాధపడుతున్న వారికి మెడిసిన్​గా ఉపయోగిస్తారు. ఒక రోగికి ఒకసారి 0.25 గ్రాముల డోసును మాత్రమే ఇస్తారు. దీనికి కారణం అల్ఫాజోలం అత్యంత ప్రమాదకరమైన డ్రగ్​కావటమే.

ఎక్కువ మత్తు కోసం..

కల్లు ఎక్కువ కిక్ ఎక్కేందుకు విక్రయదారులు అల్ఫాజోలంను వినియోగిస్తున్నారని తెలంగాణ ఎన్​ఏబీ చీఫ్ సందీప్​శాండిల్య చెప్పారు. పదేళ్ల క్రితం వరకు కల్తీ కల్లు కోసం డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్‌లను వాడేవారన్నారు. ప్రస్తుతం వీటితో పోలిస్తే వెయ్యి రెట్లు మత్తు కలిగించే అల్ఫాజోలం వాడుతున్నారు. దీని ధర 10 గ్రాములకు రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిమాణంతో కనీసం 30 వేల సీసాల కల్లును తయారు చేస్తున్నారు. ఒక్కో సీసా రూ.50 ఉండగా.. సుమారు రూ.13.50 లక్షలు వ్యాపారులు సంపాదిస్తున్నారు. ఇటీవల ఎన్​ఏబీ అధికారులు హైదరాబాద్​లో దాడులు జరపగా 66 కాంపౌండ్‌లో కల్తీ కల్లు విక్రయిస్తున్నట్టుగా నిర్ధారణ కావడం ఈ దందా ఏ స్థాయిలో జరుగుతోందో స్పష్టం చేస్తోంది.

ముంబయి నుంచి ఎక్కువగా..

రాష్ట్రానికి ముంబయి నుంచి ఈ డ్రగ్ వస్తోందని ఎన్‌ఏబీకి చెందిన ఓ అధికారి తెలిపారు. నగర శివార్లలోనూ తయారవుతోందనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ డ్రగ్‌కు ఒకసారి అలవాటు పడితే బానిసలు అవుతారని తెలిపారు. లాక్​డౌన్ సమయంలో ఈ డ్రగ్ కలిపిన కల్లు దొరక్క చాలా మంది విచిత్రంగా ప్రవర్తించటంతో పాటు కొందరు ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

సిండికేట్‌కు పొలిటికల్​ అండ..

ఈ కల్తీ కల్లు సిండికేట్​కు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీల నేతలను తమ వైపుకు తిప్పుకుంటారు. మహబూబ్​నగర్​లో కల్తీ కల్లు తాగి కొందరు చనిపోతే అప్పటి ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​.. అనారోగ్య మరణాలని ప్రకటించారు. అయితే, విషయం పెద్దది కావడంతో కొన్ని శాంపిళ్లను ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపారు. అయితే, వాటి ఫలితాలు ఇప్పటికీ తెలియరాలేదు.

(వివిధ సమాచార మాధ్యమాల ఆధారంగా)

Tags