సేవా భారతి సేవలు మరింత విస్తరించాలి.
వాల్మీకి ఆవాస భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎంపీ అరవింద్,.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్ట్ 25 (ప్రజా మంటలు) :
అఖిల భారత స్థాయిలో సేవా భారతి సంస్థ సేవలు మరింత విస్తరించాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లు అన్నారు.
సేవా భారతి ఆధ్వర్యంలో థరూర్ క్యాంపులో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాస నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి- లక్ష్మణ్, సేవా భారతి అఖిలభారత అధ్యక్షులు పన్నాలాల్ బన్సాలి తదితరులు హాజరై నూతన భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్ లు మాట్లాడుతూ...... దేశవ్యాప్తంగా సేవా భారతి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. గ్రామీణ నిరుపేద విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేందుకు గత 32 సంవత్సరాలుగా వాల్మీకి ఆవాస నిర్వాహకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. చదువుతోపాటు ఉత్తమ విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి లాంటి గొప్ప గుణాలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు వాల్మీకి ఆవాసం కృషి చేస్తుందన్నారు.
భవిష్యత్తులో సేవా భారతి చేపట్టబోయే ఏ కార్యక్రమానికైన తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసం ఎంతోమంది నిరాశ్రయ బాలలకు అండగా నిలిచి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారన్నారు.
ఆవాస విద్యాలయానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ..... గీతా విద్యాలయం, వాల్మీకి ఆవాసం తో తనకు, తన కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 32 సంవత్సరాల క్రితం వాల్మీకి ఆవాసాన్ని ప్రారంభించినప్పుడు ఒక విద్యార్థిని దత్తత తీసుకొని సహకరించానని తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాక మునుపు నుండి సేవా కార్యక్రమాలలోనే ఉన్నానని, సేవా భారతి చేపట్టిన కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నానని తెలిపారు.
గతంలో ఒరిస్సాలో తుఫాను సంభవించినప్పుడు సేవా భారతి ఆధ్వర్యంలో జగిత్యాల నుండి ఒరిస్సా వెళ్లి ఉచిత సేవలందించిన డాక్టర్ల బృందం లో తాను కూడా సభ్యుడిగా ఉన్నానని గుర్తు చేశారు. వాల్మీకి ఆవాసానికి ఎలాంటి అవసరం వచ్చిన తాను సహకరిస్తానని తెలిపారు.
సేవా భారతి అఖిలభారత అధ్యక్షులు పన్నాలాల్ బన్సాలి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1,50,000 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని. దేశంలోని ఆరు లక్షల గ్రామాలకు సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆర్ఎస్ఎస్ క్షేత్ర సేవ ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ జీ మాట్లాడుతూ వాల్మీకి ఆవాసం కేంద్రంగా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న నూతన భవనం 200 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా ఉన్నందున ఈ భవనంలోనే గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం అత్యాధునికమైన సంచార వైజ్ఞానిక ప్రదర్శనశాల తో పాటు కిషోర బాలికలకు వికాస శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రోజురోజుకు దేశంలో విస్తరిస్తున్న డ్రగ్ మాఫియాను అరికట్టేందుకు విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించడంతో పాటు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
ఏ సేవా కార్యక్రమానికైనా దాతల సహకారంతో పాటు సమయం ఇచ్చే కార్యకర్తలఅవసరం కూడా ఉంటుందని ఆ దిశగా సమాజం ఆలోచించాలని సూచించారు.
సేవా భారతి రాష్ట్ర కార్యదర్శి రామ్మూర్తి, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి- లక్ష్మణ్, వేణుగోపాలచార్య కౌశిక,కౌన్సిలర్ రాజకుమార్ లు ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆవాస భవన నిర్మాణానికి సహకరించిన దాతలను ముఖ్య అతిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆవాస విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
ఈ కార్యక్రమంలో ఆవాస కమిటీ సభ్యులు డాక్టర్ భీమనాత్ని శంకర్, జీడిగే పురుషోత్తం, మదన్ మోహన్ రావు, టీవీ సూర్యం, అశోక్ రావు, సంపూర్ణ చారి, మధుకర్, శ్రీనివాస్,మల్లారెడ్డి,సురేష్, కైలాసం, ఆవాస ప్రముఖ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.