బుగ్గారంలో "డిటోనేటర్ల" (బాంబుల) గోదాం వద్దే వద్దు - -సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి
బుగ్గారంలో "డిటోనేటర్ల" (బాంబుల) గోదాం వద్దే వద్దు -
-పేలుడు పదార్థాల లైసెన్సు లు ఇవ్వకండి -
-ప్రభుత్వ విప్ అడ్లూరికి, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ లకు విజ్ఞప్తి చేసిన బుగ్గారం ప్రజలు
-సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి
-ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయం :
-అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ
జగిత్యాల / బుగ్గారం/ ధర్మపురి సెప్టెంబర్ 09 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బాంబుల గోదాం (పేలుడు పదార్థాలైన డిటోనేటర్ల) నిలువలకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని, వెంటనే వాటిని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని సోమవారం ప్రభుత్వ విప్ అయిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కు వేర్వేరుగా బుగ్గారం ప్రజలు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు గ్రామ అభివృద్ది కమిటి అధ్వర్యంలో పలువురు ప్రముఖులు, గ్రామస్తులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
అలాగే జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సోమవారం జరిగిన ప్రజావాణిలో కూడా స్వయంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కలిసి బాంబుల (డిటోనెటర్ల) గోదాం నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు జారీ చేయవద్దని విజ్ఞాపన పత్రాలు అందజేశారు. సంబంధిత అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఎక్కడికక్కడ అనుమతులు నిలిపివేయాలని వారు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కోరారు. ప్రాణాంతకమైన ఈ బాంబుల గోదాం నిర్మాణం వలన ప్రజలకు, వన్యప్రాణులకు, పర్యావరణానికి తీరని నష్టం కలిగే ప్రమాదాలు పొంచి ఉన్నాయని వారు వివరించారు.
ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయం :
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ
బుగ్గారం విడిసి, ఎండీసి ల అధ్వర్యంలో వినతి పత్రాలు అందుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రజలకు, పర్యావరణానికి, వన్య ప్రాణులకు నష్టం కలిగించే పనులు గానీ, ప్రాణ హాని తలపెట్టే పనులు గానీ నియోజక వర్గంలో ఎక్కడా కూడా చేయనీయమని హామీ ఇచ్చారు.
సంబంధిత అన్ని శాఖల అధికారులతో మాట్లాడి ఇట్లాంటి ప్రాంతకమైన పనులకు ఎలాంటి అనుమతులు జారీ చేయకుండా చూస్తానని బుగ్గారం ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజా క్షేమమే తన లక్ష్యమని - నియోజక వర్గంలో ఆయా గ్రామాల ప్రజల అభీష్టం మేరకే పనులు చేస్తూ, పాలన కొనసాగిస్తామని అభయ మిచ్చారు.
లక్ష్మణ్ కుమార్ హామీతో బుగ్గారం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.
విడిసి కోర్ కమిటీ చైర్మన్ అయిన తెలంగాణ జన సమితి పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, గ్రామ అభివృద్ది కమిటి అధ్యక్షులు నక్క చంద్రమౌళి, మాజీ సర్పంచ్ మసర్తి రాజిరెడ్డి, ఎండీసి కో - కన్వీనర్ అయిన మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు పెద్దనవేణి రాగన్న, బుగ్గారం పోచమ్మ ఆలయాల కమిటి ఛైర్మన్ మసర్తి నర్సయ్య, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పొలంపెల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శి కూతురు పోచమల్లు, మసర్తి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------