గాంధీ డాక్టర్లు పట్టించుకోవడం లేదంటూ మెసెజ్ వైరల్
గాంధీ డాక్టర్లు పట్టించుకోవడం లేదంటూ మెసెజ్ వైరల్
* వైరల్ తర్వాతే డాక్టర్లు స్పందించారన్న బంధువులు
* పేషంట్ కు బాగానే ట్రీట్మెంట్ చేస్తున్నామని సూపరింటెండెంట్ వివరణ
సికింద్రాబాద్, ఆగస్ట్ 19( ప్రజామంటలు ) :
అత్యవసర వైద్యం అందించాల్సిన పేషంట్ ను గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లు పట్టించుకోవడం లేదంటూ ఓ మెసెజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై వైద్యాధికారులు స్పందించారు. వివరాలు ఇవి..ఈస్ట్ గోదావరి జిల్లా మండపేట సమీపంలోని కపిలేశ్వపురం మండలం తాటిపూడి గ్రామానికి చెందిన ఇల్ల శ్రీనివాస్, సుశీల దంపతులు గత కొంత కాలం క్రితం జీవనోపాధికై సిటీకి వచ్చి, అంబర్ పేట తిరుమల నగర్ లో కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంట్ లో శ్రీనివాస్ వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. ఈనెల 18న ఉదయం శ్రీను కూతురు జ్యోతి(25) ప్రమాదావశాత్తు కాలుజారి అపార్ట్ మెంట్ లోని నాలుగవ ఫ్లోర్ నుంచి కిందపడగా, తలతో పాటు వెన్నముక, కాళ్ళకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా, ఎమర్జెన్సీ వార్డులో ఎమ్ఎల్సీ కింద అడ్మిట్ చేశారు. అయితే జూడాల సమ్మె నేపద్యంలో పేషంట్ జ్యోతికి అత్యవసరమైన సర్జరీ చేయడం కుదరదని డాక్టర్లు చెబుతున్నారని, తాము ఏపీ కి చెందినవారు కావడంతో ఆరోగ్యశ్రీ కూడ వర్తించదని అంటున్నారని పేర్కొంటూ పేషంట్ జ్యోతి ఫ్యామిలీ మెంబర్స్ సోమవారం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కోల్ కతా లో చనిపోయిన డాక్టర్ కూడ తన కూతురు లాంటిదే నని, ఇప్పుడు మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన కూతురును బతికించడండి అంటూ ఆ మెసెజ్ లో వేడుకున్నారు. దీంతో ఈ విషయం వైరల్ కావడంతో వైద్యులు స్పందించారు. తాము సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వెంటనే న్యూరో సర్జన్ డాక్టర్లు పేషంట్ వద్దకు చేరుకొని ట్రీట్మెంట్ ప్రారంభించారని పేషంట్ జ్యోతి బావ రవిశంకర్ తెలిపారు. ఈవిషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజకుమారిని సంప్రదించగా, పేషంట్ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని, జ్యోతి ఇంకా షాక్ లోనే ఉందన్నారు. తీవ్ర గాయాలైనందున డాక్టర్లు ప్రత్యేక శ్రద్దతో ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలిపారు. పేషంట్ స్థానికులు కానప్పటికీ, ఆరోగ్యశ్రీ వర్తించనప్పటికీ సమస్య లేదన్నారు. అవసరమైతే పేషంట్ ట్రీట్మెంట్ ఖర్చులు ఆసుపత్రినిధుల నుంచి ఖర్చు పెడతామని భరోసా ఇచ్చారు. డాక్టర్ల నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. గతంలో చాలా సందర్బాల్లో ఆసుపత్రి నిధులతో పేషంట్లకు అవసరమైన వైద్యం అందించామని సూపరింటెండెంట్ గుర్తుచేశారు.
––––––––––––––
–ఫొటోలు:
1: గాంధీలో ట్రీట్మెంట్ పొందుతున్న జ్యోతి
2: జ్యోతి ( ఫైల్)
–––