యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు
యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి క్షేత్ర దేవస్థాన అంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో బుధ వారం భరణీ నక్షత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక్కడి యమ ధర్మరాజు మందిరం, విశేష ప్రాధాన్యతను సంతరించు కుంది. భారతావని లోనే అరుదుగా, అపు రూపంగా, క్షేత్రంలో వెలసిన "యమ ధర్మరాజును దర్శిస్తే", "యమపురి" ఉండబోదని ప్రతీతి. ధర్మపురిలో దక్షిణ వాహినిగా ఉన్న గౌతమి యందు దక్షిణాభిముఖులై, స్నానాలు ఆచరిస్తే నరసింహుని దర్శిస్తే, నరక బాధలు ఉండవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. యమ ధర్మరాజును దర్శించే భక్తుల సంఖ్య, నానాటికీ అధికమ వుతున్నది. ఇటీవల సంభవి స్తున్న అనూహ్య ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా, అకాల మృత్యు నివారణకై అధర్వణ వేదంలో పేర్కొనబడిన "ఆయుష్య సూక్తం" ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే భరణి నక్షత్రం, చతుర్దశి తదితర ప్రత్యేక దినాల సంధర్భంగా, అభిషేకం, ఆయుష్య సూక్తం, యమ సూక్త మంత్రం, పురుష సూక్తం, శ్రీసూక్తం, జ్వర హర స్తోత్ర పఠనాలు, రోగ నివారణ సూక్తాలు పూజలు, యమాష్ట కాది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బుధ
వారం యమ ధర్మరాజుకు విశేష అర్చనలు, పూజాదులు నిర్వహించారు.
పవిత్ర గోదావరి నది తీరాన వెలసి ఆస్తిక ప్రపంచానికి వరదాయిగా, భక్తి, ముక్తి ప్రదాయినిగా విరాజిల్లుతున్న హరిహర క్షేత్రమైన ధర్మపురిలోని, సమస్త భారతావని లోనే అపురూపంగా వెలసిన, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో మాఘ మాస అంతర్గత భరణీ నక్షత్రంతో కూడిన సందర్భంగా మహా సంకల్ప యుక్త అభిషేకం, ఆయుష్య సూక్తం, యమసూక్త మంత్రం, పురుష సూక్తం, శ్రీసూక్త పఠనాది ప్రత్యేక పూజాది కాలను, అనంతరం జ్వరహర స్తోత్రము రోగ నివారణ సూక్తములచే పంచామృత అభిషేక యమాష్టక పఠనం, హారతి మంత్రపుష్ప, తీర్థ ప్రసాద వితరణాది ప్రత్యేక కార్యక్రమాలను దేవస్థానం పక్షాన నిర్వహించారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, వేదపండితులు పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ , అర్చకులు నేరెళ్ల వంశీకృష్ణ ,వొద్ధిపర్తి కళ్యాణ్ అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ , సంపత్ కుమార్, రాజగోపాల్ మరియు అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.