ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
ధర్మపురి జనవరి 20:
దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా, గోదావరి తీరాన వెలసి, మున్సిపాలిటీ, మండల, నియోజక వర్గ కేంద్రంగా, నిత్య భక్త జన సందడితో అలరారే ధర్మపురి క్షేత్రం సమగ్రాభివృద్ధికి కృషి సల్పగనని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి
లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి క్షేత్రంలో 15కోట్ల పై చిలుకు టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తో కలిసి సోమవారం శంకుస్థాపనలు చేశారు. గోదావరి తీరాన, 3వార్డులో చేపట్టనున్న సైడు కాలువ, రోడు నిర్మాణాలకు భూమి పూజ చేసిన అనంతరం వార్డు సభ్యులు సంగన భట్ల సంతోషి దినేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ...గత 15ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఓడినా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, పార్టీనే నమ్ముకున్న తనకు కాంగ్రెస్ అగ్ర నేతల, ప్రభుత్వం వద్ద ప్రత్యేక గుర్తింపు ఉందని, అందుకే ప్రస్తుతం తాను ఏ పని గురించి వెళ్ళినా, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు గౌరవించి, చేసి పెడుతున్నారని వివరించారు. అసాధ్యమని భావించిన సాయం డిగ్రీ కళాశాల పునరుద్ధరణలో, సాగునీటి విడుదల విషయంలో, పట్టణంలో విద్యుత్ స్తంభాలు, వైర్లు తరలింపులో ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. బస్ డిపో, డిగ్రీ కళాశాల తదితర అంశాలపై త్వరలో జీఓలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు.
వరద గట్టు ఏర్పాటుకు కృషి
ధర్మపురిలో గోదావరి వరదల తాకిడికి జరుగుతున్న భారీ నష్టాల నివారణకై, ప్రజల అభ్యర్థన మేరకు వరద గట్టు నిర్మాణానికి కేంద్ర నిధులు సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని శక్తి వంచన లేని కృషి చేస్తానని పెద్ద పెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. ఎంపీ లాడ్స్ నుండి దేవస్థానం అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.
అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, కమిషనర్ శ్రీనివాస్, తహశీల్దార్ కృష్ణ చైతన్య, మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ నర్సింలు, కౌన్సిలర్ల బృందం, నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.