ఈజీ మనీ కోసం షట్టర్లు ఎత్తి, దుకాణాల్లో చోరీలు
ఈజీ మనీ కోసం షట్టర్లు ఎత్తి, దుకాణాల్లో చోరీలు
* ముగ్గురు నిందితుల అరెస్ట్
* రూ.28లక్షల62వేలు స్వాధీనం
సికింద్రాబాద్ ఫిబ్రవరి 03 (ప్రజామంటలు) :
మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో దుకాణాల షట్టర్లు ఎత్తి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యులు గల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకొని, అరెస్ట్ చేశారు. సోమవారం మహాంకాళి ఏసీపీ సర్ధార్ సింగ్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. జనవరి 31న అర్ధరాత్రి మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్బోయిగూడ లోని దీపక్ ఇంజనీరింగ్ కంపెనీ లో షట్టర్ ను బలవంతంగా ఓపెన్ చేసి, దుకాణం లాకర్ లోని రూ30లక్షల20వేలను దొంగలించారు.
ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న మహాంకాళి పోలీసులు మార్కెట్, రాంగోపాల్ పేట పోలీస్ సిబ్బందితో కలిసి సీసీ టీవీఫుటేజీ, మొబైల్ నెట్ వర్క్ సిగ్నల్స్ తో చోరికి పాల్పడ్డ వారి కదలికలను గుర్తించారు. సికింద్రాబాద్ సితార లాడ్జీలో ఓ నిందితుడిని పట్టుకొని, మిగితా మరో ఇద్దరిని మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ28లక్షల62వేల ను స్వాధీనం చేసుకొని, వారిని అరెస్ట్ చేశారు. మహారాష్ర్ట లోని భీవండి కి చెందిన మురళీ ధర్ మోహన్ లాల్ శర్మ (39), యూపీ లోని జాన్ పూర్ కు చెందిన చంద్రభాన్ పటేల్(39), ఉదయ్ రాజ్ సింగ్(48) లపై కేసు నమోదు చేశారు. వీరు గతంలో సికింద్రాబాద్ ఏరియాలో టెక్స్టైట్ బిజినెస్ చేసేవారని, లాక్ డౌన్ సమయంలో వీరు నష్టపోయి, దివాళా తీశారని ఏసీపీ తెలిపారు. బిజినెస్ ఏరియా సికింద్రాబాద్ ప్రాంతంలో భారీ నగదు లావాదేవీలు జరుగుతాయనే విషయం తెలిసిన వీరు ఇక్కడ దోపిడికి ప్లాన్ వేశారు. చోరి జరిగిన మూడు రోజుల్లోనే ముఠాను పట్టుకున్న మహాంకాళి ఇన్స్పెక్టర్ పరశురామ్,డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్,ఎస్ఐ లు గంగాధర్, శ్రీవర్దన్ లతో పాటు మహాంకాళి, మార్కెట్, రాంగోపాల్ పేట పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.