నూతనంగా మహిళా మండలి ఏర్పాటుకు సన్నాహక సమావేశం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో మహిళలు నూతనంగా ఏర్పాటు చేయబోయే మహిళా మండలి సన్నాహక సమావేశం ఆదివారం బ్రాహ్మణ వీధిలో నిర్వహించారు.
మహిళలు సంఘటితంగా ఉండి ఆర్థిక స్వావలంబనకై ముందడుగు వేయడానికి మహిళల ఐక్యత ఎంతైనా అవసరమని వక్తలు పేర్కొన్నారు. సమకాలీన సమాజంలో ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కోవడానికి మహిళలు సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అదేవిధంగా మహిళలు సాధికారతతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమని అన్నారు.
త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు జయ, సుహాసిని ,సాకేత తదితరులు తెలియజేశారు.
కుటుంబ నిర్వహణలో మహిళల పాత్ర కీలకమైనదని మహిళలు కేవలం ఇంటికి పరిమితం కాకుండా సాటివారికి సహకరించడంలో ముందుండాలని అన్నారు.