దేవస్థానం పనులలో ఆలస్యం ఆక్షేపణీయం -ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
దేవస్థానం పనులలో ఆలస్యం ఆక్షేపణీయం
-ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి అక్టోబర్ 26:
ధర్మపురి క్షేత్రం లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంకు సంబంధించిన అభివృధ్ధి పనులలో ఆలస్యం ఆక్షేపణీయమని, సకాలంలో చేయని వారికి నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి
లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. శనివారం దేవస్థానంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఇఓ సంకటాల శ్రీనివాస్, ఇంజినీరింగ్ తదితర సంబంధిత అధికారులతో కోట్లాది నిధులతో చేపట్టిన, చేపట్టనున్న వివిధ పనుల గురించి విప్ లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ...పనులను గడువులోపు పూర్తి చేయాలని సక్రమంగా పనిచేయని వారికి నోటీసులు జారీ చేయవలసినదిగా సూచించారు. దేవస్థానమునకు వచ్చే భక్తులకు రుచికరమైన భోజనము అందించాలని మహా అన్నదానము భవనము నిర్మించుటకు దాతలు ముందుకు వస్తున్నారని, కనీసం 500 మందికి భోజన వసతి కల్పించుటకు సూచించారు. భూసేకరణ విషయములో కోర్టులో కేసులు త్వరితగతిన పరిష్కరించి, భూసేకరణ చేయాలని యజమానులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. అదే విధముగా వివిధ నిర్మాణ పనులకు 50 కోట్లకు ఎస్టిమేట్స్ వేయించి ఇచ్చినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నిధులు మంజూరి చేయిస్తానని, ఎటువంటి ఆలస్యము లేకుండా అభివృద్ధి పనులకు అంచనాలు తయారుచేసి సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ముఖ్యంగా గోదావరి తీరములో అత్యవసరముగా భక్తులు సేద తీరుటకు శాశ్వతంగా డార్మిటరి, భక్తుల సౌకర్యార్థం బట్టలు మార్చుకొను గదులు, మరుగుదొడ్లు, షవర్లు ఏర్పాటు చేయుటకు సత్వర చర్యలు గైకొనగలరని ఆదేశించారు. స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మెట్ పెల్లి
ఆర్.డి.ఓ. శ్రీ శ్రీనివాస్, స్థానిక తహశీల్దార్ కృష్ణచైతన్య, దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ సంకటాల శ్రీనివాస్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ టి.రాజేష్, డిప్యూటి ఎక్జిక్యూటివ్ ఇంజనీర్, రఘునందన్, అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్.ప్రతాప్, దేవస్థాన పర్యవేక్షకులు డి.కిరణ్, సీనియర్ అసిస్టెంట్ ఎ.శ్రీనివాస్
పాల్గొన్నారు.
అంతకు ముందు ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము దర్శనమునకు వచ్చు భక్తులకు మెరుగైన సౌకర్యములు కల్పించుటకు, గోదావరినది స్నానము చేయు భక్తులకు వసతుల కల్పనకు, వివిధ అభివృద్ధి పనుల గూర్చి సమీక్ష చేయు సందర్భములో ఉదయం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, బస్టాండు వద్ద గల 60 గదుల ధర్మశాల నిర్మాణము, కె.ఎన్.ఆర్. షాపింగ్ కాంప్లెక్స్ను, పుట్ట బంగారము నిర్మాణమును, నాగమయ్య దేవాలయము నిర్మాణమును పరిశీలించారు.